December 18, 2012

గల్ఫ్ బాధితులకు ప్రత్యేక శాఖ

ఎడారి దేశంలో తనువు చాలించింది ఒకరు! చనిపోయి కొన్ని నెలలైనా ఇప్పటికీ స్వగ్రామానికి కట్టె చేరని దైన్యం మరొకరిది! జీవించి ఉన్నా.. జీవచ్ఛవాలుగా బతుకుతున్న కష్టం మరెందరిదో! పిడికెడు బువ్వ కోసం పొట్ట చేతపట్టుకుని దేశం కాని దేశం వెళ్లి నానా అవస్థలు పడుతున్న మనవాళ్ల బాధలు వర్ణనాతీతం. పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా కండ్లపల్లి వచ్చినప్పుడు చాలామంది గల్ఫ్ బాధితులు వచ్చి కలిశారు. వారందరితో కలిసి నేనూ సమావేశమయ్యా.

తమ కష్టాలను చెబుతూ వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వాళ్ల బాధలు వింటే నా గుండె కూడా తరుక్కుపోయింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి జరగరానిది జరిగితే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణనాతీతం. ఒకవేళ, అక్కడే మరణిస్తే వారి శవాలు నెలల తరబడి రావడం లేదని, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకుండాపోతున్నామని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లే క్రమంలో మోసాలకు అంతే లేదు. నకిలీ వీసాలతో బ్రోకర్లు వాళ్ల జీవితాలతో ఆటాడుకుంటున్నారు.

ఇక్కడ ఉన్న కొద్దిపాటి పొలాన్నో, ఆస్తినో అమ్ముకుని లేదా.. వడ్డీకి అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. అక్కడ దొరికే ఉపాధితో పొట్ట పోసుకోవచ్చని, నెమ్మది నెమ్మదిగా అప్పులు కూడా తీర్చేసుకోవచ్చని ఆశ పడుతున్నారు. కానీ, నకిలీ వీసాల కారణంగా అక్కడికి వెళ్లిన తర్వాత ప్రభుత్వాలు అక్కడి నుంచి వారిని గెంటేస్తున్నాయి. ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి! అక్కడే ఉండలేని దైన్యం! ఈ సంఘర్షణలోనే వారు ఉసురు కూడా తీసుకుంటున్నారు.

గల్ఫ్ బాధితులను తిరిగి తీసుకొచ్చేందుకు తమ వద్ద నిధుల్లేవని కేంద్రం చేతులు ఎత్తేస్తే.. వారిని పట్టించుకునే స్థితిలో మన ముఖ్యమంత్రి లేరు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చా. అధికారంలోకి వస్తే, గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా. వారి సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా.

జగిత్యాలలో ఎక్కడ చూసినా తోరణాలు! స్వాగత బ్యానర్లు! పార్టీలతో సంబంధం లేకుండా వివిధ వర్గాల నుంచి వచ్చిన మద్దతు నాకెంతో నైతిక బలాన్ని ఇచ్చింది.