December 16, 2012

అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ

జడ్జీలనూ మేనేజ్ చేశాడు!
మా పార్టీ వాళ్లను జైలుకు పంపాలనుకున్నాడు
కాల్పులు సాకుగా సతీశ్‌రెడ్డిని ఇరికించాలనుకున్నాడు
వాంగ్మూలం మార్పించాడు.. జడ్జీపై ఒత్తిడి తెచ్చాడు
పులివెందులలో ఆయనదంతా రౌడీయిజమే
అదంతా కోర్టు ఇప్పుడు తేల్చేసింది
వైఎస్‌పై చంద్రబాబు నిప్పులు
'ఆంధ్రజ్యోతి' సంచిక చదివి వినిపించిన టీడీపీ అధినేత

రాష్ట్ర ప్రజలను దారుణమైన 'షాక్'లకు గురిచేస్తున్న కరెంటు చార్జీలను అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జడ్జీలను సైతం ప్రలోభపెట్టి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేకమందిని జైళ్లకు పంపించారని దుయ్యబట్టారు. బీఎడ్ అభ్యర్థులనూ ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్స్)కి అర్హులను చేస్తానని, ప్రభుత్వంలోకి రాగానే వారికోసం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి కాంగ్రెస్ దొంగల్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి వద్ద ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రేగుంట, ఇటిక్యాల గ్రామం వరకు 8.7 కిలోమీటర్లు నడిచారు. భార్య భువనేశ్వరితో మాట్లాడి, కార్యకర్తలను పలకరించి పాదయాత్ర కోసం బస్సు దిగేసరికి మధ్యాహ్నం మూడు గంటలయింది. మార్గమధ్యలో పసుపు, మామిడి రైతులు, గొర్రెల కాపరులు, మహిళలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు కష్టాలు తీర్చుతానని రేగుంట సభలో హామీ ఇచ్చారు. "వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండి పోతున్నాయి.

టీడీపీ అధికారంలోకి రాగానే విద్యుత్తును మెరుగు పరిచి ఆ శాఖ పనితీరు మారుస్తాం. తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం. కరెంట్ చార్జీలు తగ్గిస్తా'మని హామీ ఇచ్చారు. తన అక్రమాలకు చివరకు జడ్జీలను సైతం వైఎస్ వదిలిపెట్టలేదని దుయ్యబట్టారు. "వైఎస్ హయాంలో పులివెందులలో ప్రజాస్వామ్యం లేదు. రౌడీయిజం, ముఠా కక్షలు తప్ప అక్కడ ఏ న్యాయమూ లేదు. ప్రత్యర్థులను జైళ్లలో పెట్టించి ఎవరూ రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఉండవద్దని చూశారు.

2004లో వైఎస్‌కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సతీశ్ రెడ్డి. అప్పుడు కో ఆపరేటివ్ ఎన్నికల్లో నిలబడడానికి సతీశ్ రెడ్డి పులివెందుల వెళ్లారు. ప్రచారంలో ఉండగా, ఒక ఊరులో ఆయనపై దాడి జరిగింది. రక్షణ కోసం గన్‌మెన్ కాల్పులు జరపగా ఒకరికి గాయమైంది. రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి మెజిస్ట్రేట్‌ను రప్పించాడు. సతీశ్ రెడ్డే నేరుగా తుపాకీ తీసుకుని కాల్చారని తప్పుడు వాంగ్మూలం రాయించారు. ఆయనను శాశ్వతంగా జైలుకు పంపించే కుట్ర పన్నారు. నాటి సీఎంతో జడ్జి లాలూచీ పడినట్టు తర్వాత కోర్టు తేల్చింది''అంటూ ఆదివారం 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన 'రాజుగారి సేవల చెరుపు' వార్తను ప్రజలకు చదివి వినిపించారు.

కాంగ్రెస్ దొంగలు అడవి పందుల్లా రాష్ట్రాన్ని మెక్కుతున్నారని అన్నారు. రాష్ట్రం నష్టం పోవడానికి వైఎస్ పాలన కారణమైతే, రోశయ్య పాలన చతికిల పడిందని, కిరణ్ పాలన కిరికిరిగా సాగుతున్నదని అన్నారు. కాగా, తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పదు గానీ అన్ని పార్టీలను చెప్పమనడం ఎక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్ ఎంపీలను బుజ్జగించడానికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణ సమస్య పరిష్కారానికి కాదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
కోటి రూపాయలు చూశారా?
రేగుంట సభలో చంద్రబాబు వైఎస్ కుటుంబం అవినీతి భాగోతాన్ని పిట్టకథలా చెప్పుకొచ్చారు. మీరెప్పుడైనా కోటి రూపాయలు చూశారా?అన్ని ప్రశ్నించారు. లేదు అని ప్రజల నుంచి బదులొచ్చింది. దానికి చంద్రబాబు ఇలా వివరించారు. 100 రూపాయల నోట్లు 100 కట్టగా కడితే 10 వేలు. ఐదు వేలు, 10 వేల రూపాయల కట్టలను ఒక సంచిలో నింపితే 50 లక్షలు. అలాంటి సంచులు 200 అయితే లారీ నిండుతుంది. వాటి విలువ వెయ్యి కోట్లు. అలాంటి వెయ్యి లారీల డబ్బును లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు. ఇదీ జగన్ దోచిన డబ్బు. అందులో ఒక లారీ మీ ఊరికి పంపినా మీ కష్టాలు తీరుతాయి.