December 16, 2012

జన వాక్కే నాకు ఎజెండా!

ఇప్పటికి కొన్ని లక్షలమందిని కలిశాను. ఈ రోజుదాకా 1220 కిలోమీటర్ల వరకు తిరిగాను. అందరి సమస్యలూ ఓపికతో వింటున్నాను. చెప్పాలనుకున్నది ప్రసంగాల ద్వారా కాదు.. వాళ్ల మాటల్లోనే చెప్పిస్తున్నాను. వాళ్లేమనుకుంటున్నారో కూడా వాళ్లనే అడిగి తెలుసుకుంటున్నాను. రేగుంట లాంటి వందల గ్రామాల్లో జనాలను పలకరించాను. ప్రతి ఊళ్లోనూ వాళ్లకే మైకు ఇచ్చి వాళ్ల కష్టాలు చెప్పమంటున్నాను. వాళ్లు ఏది చెబితే అదే నా పాదయాత్రకు ఎజెండా.

ఇటిక్యాల దారిలో ఒక రైతును కదిలిస్తే గిట్టుబాటు ధర లేదని గోడు వెళ్లబోసు కుంటున్నాడు. ఒక మహిళను మాట్లాడిస్తే పావలా వడ్డీ పేరుతో రెండు రూపాయలు పిండుతున్నారని ఏకరువు పెడుతోంది. ఒక విద్యార్థిని అడిగితే..స్కాలర్‌షిప్పులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక అవ్వను పలకరిస్తే పింఛను చాలడం లేదని బాధపడుతోంది. కూలీ గిట్టుబాటు కావడం లేదని బీడీ కార్మికులు, ఉద్యోగాలు దొరకడం లేదని నిరుద్యోగులు, స్కూళ్లలో కనీసం మరుగుదొడ్లు కూడా లేవని చిన్నచిన్నపిల్లలు సైతం.. కష్టాలు కలబోసుకుంటున్నారు. ఒక లక్షా యాభైవేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎటు పోతుంది? అదంతా అవినీతిపరుల ఖాతాలోకి చేరిపోతోంది. ఎంత తిన్నా ఈ కాంగ్రెస్ నేతలకు సంతృప్తనేదే ఉండటం లేదు. నిజానికి, అంత బడ్జెట్ డబ్బు పేదలకు చేరితే పేదరికం ఇంకెక్కడ?

అన్ని కష్టాలకు మూల కారణం అవినీతే. ఆ విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పే ప్రయ త్నం చేస్తున్నాను. నా యాత్రలో అవినీతిపై చర్చకే పెద్దపీట వేస్తున్నాను. అభివృద్ధికి అవినీతి గొడ్డలిపెట్టనే సంగతి అరటిపండు ఒలిచినట్టు వారికి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అందుకే 'ఒక్క అవినీతిపరుడూ లేకపోతే ఒక్క పేదవాడూ' ఉండడు అనే నినాదాన్ని పదేపదే చెబు తున్నాను. నా ప్రయత్నం ఫలించి పేదల కష్టాలు తీరే రోజు దగ్గర్లోనే ఉందని నమ్ముతున్నాను.