December 16, 2012

విధి వంచితులతో ఆటలా?

వికలాంగుల పట్ల దేవుడు చిన్నచూపు చూశాడు. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడై వారిని కుంగదీస్తోంది. వారిలో చాలామంది పుట్టుకతో వికలాంగులు కాదు. మనందరిలాగే వాళ్లకూ భగవంతుడు సకల అంగాలను ప్రసాదించాడు. తాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరే వారికి ఉరి బిగించింది. సలక్షణంగా ఉన్నవారిని వికలాంగులుగా మార్చింది. అలాంటివారిలో కొందరిని ఓబులాపూర్‌లో కలుసుకున్నాను. వారిలో కొందరు మానసిక వికలాంగులు కాగా, మిగతా వారంతా శారీరక వైకల్యంతో బాధపడుతున్నవారు. అందరివీ పేద కుటుంబాలే.

తల్లిదండ్రుల రెక్కాడితేగానీ వీళ్ల డొక్క నిండదు. చెట్టంత కొడుకు చేతికిందకు రాలేదనే దిగులు ఒకవైపు, సేవలు చేస్తూనే పోషణకు ఆ పనీ ఈ పనీ చేయాల్సి రావడం మరోవైపు.. పాపం ఆ కుటుంబాలను కోలుకోలేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్లకు ప్రభుత్వమే దిక్కు. ఆ ప్రభుత్వం మాత్రం సాయం మరిచి దిక్కులు చూస్తోంది. మిగిలిన విషయాలెలాఉన్నా వీళ్లపట్ల ఎవరికైనా కనీస మానవత్వం ఉండాలి. ఈ విధి వంచితులపై ఎక్కువ శ్రద్ధపెట్టి పనిచేయా లి. అప్పట్లో నేను చేసిందిదే. వీళ్లకు జీవితంపై ఆశ కల్పించడం కోసం ఇప్పుడు ప్రత్యేక పాలసీ తెచ్చాను. ఇంకా ఏం చేయాలనే దానిపై ఇతర వర్గాల నుంచీ సలహాలు తీసుకుంటున్నాను. ఏమైనా వీరి కష్టాలు తీరే రోజొకటి ఉందనే ఆశతోనే నడుస్తున్నాను.

పాత దామరాజుపల్లెకు వచ్చినప్పుడు నడ్డి విరుస్తున్న 'పావలా వడ్డీ' దారుణాలను డ్వాక్రా మహిళలు కళ్లకు కట్టారు. ఆ మహిళల్లో చాలామందికి చదువు లేదు. ఆదిలాబాద్ జిల్లా డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలి పరిస్థితీ ఇంతే. చదువు లేకపోయినా సంఘాలను సమర్థంగా నడుపుతోంది. నిజానికి, ఇలాంటి మహిళామణులను మరింతగా ఉత్సాహపరచాలి. కానీ, వీళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రాణం ఉసూరుమంటోంది. "ఏది అసలో, ఏది వడ్డీయో తెలియడం లేదు సార్. మేము తీసుకునే దానిపై ఎంత వడ్డీ వేస్తున్నదీ చెప్పరు. మూడు లక్షల రూపాయల లోనులో 50 వేలు ముందే కోతపెట్టి ఇస్తున్నారు'' అని ఆ మహిళలు వాపోయారు. ఆడపడుచులతో కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడదని వాళ్లకు ధైర్యం చెప్పి అక్కడ నుంచి కదిలాను.