December 16, 2012

నేనేం చేయాలో చెప్పండి పాదయాత్రలో ప్రజలతో చంద్రబాబు

"పాదయాత్రలో మీ కష్టాలు నేరుగా చూశాను. సమస్యలన్నీ తెలుసుకున్నా. కష్టాల్లో, నష్టాల్లో మీతో ఉండాలని, వాటిని మీతో పంచుకోవాలని మీ వద్దకు వచ్చాను. నేనెలా ఉండాలో.. నేనేం చేయాలో మీరే చెప్పండి. మల్లాపూర్ వరకు ప్రతి రోజు నేనే మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు మీ నుంచి సమస్యలు, వాటి పరిష్కారాన్ని వినాలనుకుంటున్నా'' పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో స్థానిక ప్రజలతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలివి. అనడమే కాదు.. ప్రజలకు మైకును అందించి వారి సమస్యలు విన్నారు.

ఈ సందర్భంగా ఒక రైతు మాట్లాడుతూ ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువుకు వారే ధర నిర్ణయిస్తారు. రైతు పండించే ధాన్యానికి మాత్రం ఆ అవకాశం లేదు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలి. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ఉండి ఉపయోగం లేదు. పంటలకు సలహాలు ఇచ్చే వాళ్లు లేరు. కాబోయే ముఖ్యమంత్రి మీరే.. ఈ దళారీ వ్యవస్థను తొలగించి ఆదుకోవాలి అని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మరో రైతు కోరారు. మాదిగ విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్త మాట్లాడుతూ మాదిగ జాతికి మీ వల్లే లాభం జరిగిందని చెప్పారు.

చొప్పదండిలో లిడ్ క్యాప్‌కు కేటాయించిన స్థలాన్ని ఏపీఎస్పీ బెటాలియన్‌కు ఇచ్చారని దీనిపై మీరు పోరాడాలని కోరారు. "తెలంగాణ కోసం శ్రీకాంత్‌చారి ఆత్మ బలిదానం చేశారు. అలా వెయ్యి మంది వరకు చనిపోయారు. మాపై 30 నుంచి 40 వరకు కేసులున్నాయి. తెలంగాణకు మీరు అనుకూలంగా ఉండి, కేసులను ఎత్తివేయించాలి'' అని ఓ విద్యార్థి విజ్ఞప్తి చేశారు. కనీస వేతనాల కోసం తాము పోరాడితే మద్దతు ఇచ్చారని, కానీ అవి అమలు కాకుండా జీవోను అబయన్స్‌లో పెట్టిందని, దానిని సరిచేయాలని కోరారు.

పెన్షన్ 1500 రూపాయలు ఇప్పించాలని బీడీ కార్మికుల సంఘం ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. "అవినీతి చాలా పెరిగింది. తెలంగాణ ప్రజలను అన్నింట్లో అణగ దొక్కుతున్నారు. ఉద్యోగాలు ఇస్తలేరు. మా బడిలో నీళ్లు లేవు. మరుగు దొడ్లు లేవు. అవినీతిని నిర్మూలించి మాకు మంచి చదువులు చదివించి ఉద్యోగాలు ఇప్పించాలి'' అని మరో విద్యార్థిని కోరింది. రాష్ట్రంలో అవినీతి పరుల ఆట కట్టించేందుకు మీరు రహస్యంగా విచారణలు జరిపించి వారిపై కేసులు పెట్టి ఆ డబ్బును రికవరీ చేయాలని సూచించింది. ఉద్యోగులకు సరిపడా వేతనాలు పెంచితే వాళ్లు లంచాలు తీసుకోరని సలహా ఇచ్చింది.

"మీరే అధికారంలోకి రావాలి. మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తాం'' అని మరో రైతు స్పష్టం చేశారు. మార్గమధ్యలో రైతులు, గొర్రెల కాపరులు, మహిళలు, విద్యార్థులు, వివిధ కుల వృత్తుల వారిని పలకరించి వారి సమస్యలను తెలుసుకుని ఏమి చేస్తే బాగుంటుందని సలహాలు కోరారు. ప్రజలతోనే మాట్లాడించి వారి సమస్యలను విని, ఏం చేయాలో వారి నుంచే చంద్రబాబు సలహాలు తీసుకోవడం ఆయన పాదయాత్రలో కొత్త కోణం.