December 14, 2012

వారి నమ్మకమే నడిపిస్తోంది:చంద్రబాబు

ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది రోజులూ తొమ్మిది గంటల్లా గడిచిపోయాయి. ప్రతి పట్టణం, పల్లె, గూడెం ఎంతో అభిమానంతో నన్ను ఆదరించాయి. నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎక్కువభాగం గిరిజన ఆవాసాలే. నా జీవితంలో మరవలేనంత ప్రేమను ఇక్కడి ఆదివాసీలు అందించారు. కల్లాకపటం లేని మనసు వీళ్లది. అది మరిచిపోలేను. ప్రతి చోటా సంప్రదాయ నృత్యాలు, సంగీత వాయిద్యాలతో నాకు ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరించి తమ గూడేలకు తోడ్కొని వెళ్లారు.

వారిలో నా పట్ల ఉన్న అభిమానం కదిలించేసింది. ఇంత ఆధునిక ప్రపంచంలోనూ కుళ్లూకుతంత్రాలూ లేకుండా జీవిస్తున్న జాతి వీళ్లది. కష్టపడి పొట్టపోసుకుంటారు. ఇవ్వడమే గానీ తీసుకోవడం, నోరు తెరిచి అడగడం తెలియని మనుషులు. పాలకుడిగా నేను ఆదివాసీల గురించి ఎక్కువగా పట్టించుకోవడానికి కారణమిదే. వాళ్ల జీవితాల్లో వెలుగు కోసం నా హయాంలో ఈ జిల్లా నుంచే 'వెలుగు' ప్రాజెక్టు ప్రారంభించాను.ఆదివాసీ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టి సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాం. ఆదిలాబాద్‌లో తిరుగుతున్నప్పుడు..మైదాన ఆదివాసీల కోసమూ అలాంటి సంస్థ ఒకటి అవసరమనిపిస్తోంది.

డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వాళ్ల జీవితాలను కబళిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వారి అక్కరకు రావడం లేదు. నా హయాంలో ప్రారంభించిన ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలే దిక్కులా ఉన్నాయి.ఈ మనుషులనిలా అడవికి వదిలేసినవాళ్లు పాలకులా? రాక్షసులా? గిరిజనుల పిల్లలు మాణిక్యాలు. చదువుకునే అవకాశం కల్పిస్తే అద్భుతాలు చేయగల చురుకుదనం వాళ్లలో చూశాను. ఖానాపూర్ క్రాస్‌లో యువతతో మాట్లాడినప్పుడు..అవినీతిపై వారి అవగాహన ముచ్చటేసింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక డ్వాక్రా మహిళలు కలిశారు. "సార్. .నువ్వు మా కోసం పెడతానన్న పథకాలు, మాఫీ హామీలు, డిక్లరేషన్లే బతుకుపై తిరిగి తీపిని పుట్టిసు ్తన్నాయి'' అని ఆ మహిళలు చెబుతున్నప్పుడు, ఈ మాత్రం నమ్మకం ఇస్తే ఎన్ని వేల మైళ్లయినా నడిచేయొచ్చనిపించింది.