December 14, 2012

నేటి నుంచి కరీంనగర్‌లో 'మీ కోసం'..

కేసీఆర్.. ఓ కుంభకర్ణుడు
దొంగ నాటకాలాడుతున్నాడు
ఆదిలాబాద్‌లో ముగిసిన పాదయాత్రలో బాబు ధ్వజం

ఆదిలాబాద్, డిసెంబర్ 14"కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. నిద్ర లేచిన తర్వాత మభ్యపెట్టేలా ప్రకటనలు చేస్తాడు. దొంగ నాటకాలాడతాడు'' అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మండి పడ్డారు. కాంగ్రెస్ రాక్షస పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దదని, జిల్లా వాసుల సౌకర్యార్థం మంచిర్యాలను ప్రత్యేక జిల్లాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలో చివరి రోజైన శుక్రవారం ఖానాపూర్ నియోజక వర్గం పరిధిలోని ఎక్బాల్‌పూర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఖానాపూర్ క్రాస్ రోడ్, ఖానాపూర్, సుర్జాపూర్, బాదనకుర్తి వరకు 15.7 కిలో మీటర్లు నడిచి కరీంనగర్ సరిహద్దు గ్రామాలకు చేరుకున్నారు. అంతకుముందు.. వేలాది మంది జనం ఖానాపూర్ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ, లంబాడి నృత్యాలతో, కోలాటాలు, మేళా వాయిద్యాలతో, డప్పు చప్పుళ్లతో బాణసంచా పేల్చి తమ సంతోషం ప్రకటించుకున్నారు.

అనంతరం పొలాల్లోని రైతులను, కూలీలను, కార్మికులను, పల్లె ప్రజలను పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చెలరేగిపోయారు. టీఆర్ఎస్‌తో ఏం కాదని, వారు ప్రజల గురించి ఏం పట్టించుకోరని దుయ్యబట్టారు. గతంలోగానీ, ప్రస్తుతం, భవిష్యత్‌లోగానీ తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పార్టీ నడుచుకుంటుందని పునరుద్ఘాటించారు. అయినా తమ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఆ సొమ్ముతో జైలు నుంచే రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఆయనపై కేసు ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమవుతుందన్నారు.

"గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై వారికే హక్కు ఉండాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేస్తాం. అటవీ భూముల పట్టాలు గిరిజనులకు ఇస్తాం. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాం'' అని చెప్పారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలాఉండగా, శుక్రవారం నాటి పాదయాత్రలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. శుక్రవారంతో ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిదిరోజుల పాదయాత్ర ముగిసింది. జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల పరిధిలో వందలాది గ్రామాల మీదుగా యాత్ర సాగింది. జిల్లాలో 146.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

కరీంనగర్‌లోకి 'మీకోసం..'

కరీంనగర్: మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామం నుంచి శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర మొదలు కానుంది. సంగెం శ్రీరాంపూర్ మీదుగా కొత్తదామ్‌రాజ్ పల్లె గ్రామానికి చేరుకొని గోదావరి నది ఒడ్డుకు చేరుకుంటారు.

భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌తో కలిసి ఉమా మహేశ్వరాలయంలో జరిగే చండీ యాగంలో పాల్గొంటారు. పాతదామరాజ్‌పల్లి, మల్లాపూర్, గొర్రెపల్లి వరకు 16 కి.మీ. నడుస్తారు. ఈ నెల 27వరకు జిల్లాలో యాత్ర సాగుతుంది.