December 14, 2012

గిరిజనుల సాగు భూములకు పట్టాలు : చంద్రబాబు

అన్ని విధాల వెనుకబడిన గిరిజనులు
పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు

అదిలాబాద్, డిసెంబర్ 14 : గిరిజనులు అన్నివిధాల వెనుకబడి ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చదువుకున్న యువకులకు ప్రత్యేక డిఎస్సీ, విశ్వవిద్యాలయం, ప్రతి జిల్లాలోనూ గిరిజన భవనాలను ఏర్పాటు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అంతే కాకుండా గిరిజనులకు ఐదు లక్షల రూపాయల వరకు పూచీ కత్తు లేకుండా బ్యాంకు రుణాలు అందిస్తామని అన్నారు.

'వస్తున్నా మీకోసం' కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి 70వ రోజుకు చేరింది. కాగా జిల్లాలో తొమ్మిదో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకుఅన్ని సదుపాయాలతోబాటు చట్ట సభలు, స్థానిక సంస్థలు, ఉపాధిలో కూడా 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామన్నారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇస్తూ, గిరిజనులకు వరాలజట్లు కురిపించారు.

చంద్రబాబు చేస్తున్న వెంట భారీగా కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. నేటితో అదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగియనుంది. రేపటి (శనివారం) నుంచి కరీంనగర్ జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశించనున్నారు.

కాగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ సమీపంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బస చేసే స్థలంలో చిరుత పులి తిరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై అటవీ ప్రాంతంలో గట్టిబందోస్తును ఏర్పాటు చేశారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర సందర్భంగా గురువారం రాత్రి మామడ మండలంలో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బస స్థలానికి చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు.