December 28, 2012

దేశంలో జోష..!


ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా .. మీకోసం'... పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ముగిసింది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 14 రోజుల పాటు సాగిన పాదయాత్ర శుక్రవారం సాయంత్రం జమ్మికుంట మండలం నగరం మీదుగా వరంగల్ జిల్లాలో ప్రవేశించింది. 90 గ్రామాల మీదుగా 181 కిలోమీటర్లు మేరకు జిల్లాలో సాగిన చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా విశేష స్పందన లభించింది. గత ఏడాది డిసెంబర్‌లో రైతులకు మద్దతుగా చేపట్టిన పోరు యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు సరిగ్గా ఏడాది తర్వాత జిల్లాకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పాదయాత్ర ముగిసే సరికి కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నది.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా 2008న ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను మరోమారు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఇవ్వడం ద్వారా తెలంగాణకు అనుకూలమేనని మరోసారి టీడీపీ విస్పష్టంగా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణవాదం నేపథ్యంలో ఎటు తేల్చుకోలేక తంటాలు పడుతున్న టీడీపీ నేతలు, శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటింది. భవిష్యత్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురించాయి.ప్రజలతో మమేకం... మారిన ఆహార్యం... రెండు వారాల పాటు పాదయాత్రలో భాగంగా గ్రామీణప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు అక్కడి ప్రజలతో మమేక మయ్యారు. అట్టడుగు వర్గాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. హైటెక్ విధానాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చంద్రబాబు నేడు ఆ విధానాలను పక్కనబెట్టి చేతివృత్తులు, కులవృత్తులు, మహిళలు, రైతులు, కార్మికులు తదితర వర్గాలు పడుతున్న ఇక్కట్లను గుర్తించారు.

వారి సమస్యలను సావధానంగా తెలుసుకొని పరిష్కారానికి మార్గం చూపేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. రైతుల రుణమాఫీ, చేనేత ప్యాకేజీ, బీసీ డిక్లరేషన్, ముస్లీంలకు రిజర్వేషన్లు, చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూత, మగపిల్లలకూ సైకిళ్లు, ఉచితంగా పీజీ వరకు విద్య ... తదితర కార్యక్రమాలను ప్రకటిస్తూ ఆయా వర్గాల వారిని తనవైపునకు తిప్పుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలించాయనే చెప్పవచ్చు. తెలంగాణవాదం బలంగా ఉన్న ఈ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర సాఫీగా ముగియడమే ఇందుకు కారణమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజలు తమ కష్టాలను చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో పాటు ్‌మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయి...* అంటూ బాహాటంగా ప్రకటించడం గమనార్హం. తెలంగాణవాదం ఎంత బలంగా ఉన్నా అదే సమయంలో తాము పడుతున్న కష్టాలు కూడా తక్కువేమీ కాదంటూ సామాన్య ప్రజానీకం రోడ్లపైకి వచ్చి చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. అవినీతి ... అభివృద్ధి...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిపోయిన అవినీతి, తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ చంద్రబాబు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

దాదాపు అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ పాలనపై పెదవి విరుపే వ్యక్తం కావడం ... చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదంటూ ప్రజలే చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గణాంకాలతో ఏకరువు పెట్టి ప్రజలకు చేరువ కావడానికి యత్నించారు. గతంలో మాదిరిగా రొటీన్ ప్రసంగాలు కాకుండా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగాలను కొనసాగించడం కార్యకర్తలకు కూడా ఉత్సాహాన్ని కలిగించింది. కాంగ్రెస్ నేతలు పందికొక్కులా దోచుకుంటున్నారు ... వేల కోట్లు గడించారు.. బాబ్లీని అడ్డుకునేందుకు తాము ఉద్యమం చేపట్టి జైలుకు వెడితే కేసీఆర్ ఎగతాళి చేశారు... బీడీ కట్టలపై పుర్రె గుర్తు కేసీఆర్ పుణ్యమే.. జగన్ లక్ష కోట్ల డబ్బు దోచుకొని జనాన్ని కష్టాలపాలు చేశారు... అవినీతిలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ ఒకటే...* అంటూ ప్రజలను సులభంగా ఆకర్షించే పదజాలాన్ని ప్రయోగిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, జగన్ కాంగ్రెస్‌లను తూర్పారబట్టారు.

మూడున్నర ఏళ్ళ వివాదానికి తెర...మూడున్నర సంవత్సరాలుగా పార్టీని నానాతిప్పలు పెడుతున్న తెలంగాణ అంశం ఎట్టకేలకు పరిష్కారమైందన్న భావన వ్యక్తమవుతోంది. 2008లో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు 2009లో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేశారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు దక్కించుకున్నారు. అయితే 2009 డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూల ప్రకటన రాగా సీమాంధ్ర నేతల ఒత్తిడితో చంద్రబాబు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ ప్రాంతంలో పర్యటించేందుకు వెనుకాడే పరిస్థితులు ఏర్పడ్డాయి.టీడీపీ కార్యకలాపాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.

ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ కారణంగానే టీడీపీని వదిలవెళ్ళారు. ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ వలసలు తక్కువే అయినా పార్టీకి తెలంగాణ అంశం ఇబ్బందికరంగా మారింది. ఎట్టకేలకు ఏడాదిన్నర కాలంగా తెలంగాణ నేతల ఒత్తిడితో వాస్తవ పరిస్థితులను గుర్తించిన చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ తేల్చిచెబుతూ వచ్చారు. అయినా మరింత స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్, బీజేపీ, జేఎసీ తదితర పక్షాల నుంచి డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో 2008లో ప్రణబ్‌కు ఇచ్చిన లేఖను పునరుద్ఘాటిస్తూ శుక్రవారం సీల్డ్ కవర్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందించడంతో తెలంగాణకు టీడీపీ అనుకూలమని స్పష్టంగా ప్రకటించినట్టయింది. దీంతో టీడీపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కరీంనగర్ వేదికగా కీలక పరిణామాలు... కరీంనగర్ జిల్లా వేదికగా తెలుగుదేశం పార్టీలో మరోమారు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1995లో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలడానికి ఈ జిల్లాయే కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడుకు ఇటు పార్టీ నేతలు, కార్యకర్తలు అటు ప్రజలు తెలంగాణవాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. తెలంగాణపై సానుకూలతను ప్రకటించాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఇతర పార్టీల నుంచి పెద్దగా నిరసనలు, ఆటంకాలు ఎదురుకాకపోయినా ప్రజలు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని మరోసారి గుర్తించిన చంద్రబాబు ప్రతీ రోజు తన పాదయాత్ర సందర్భంగా తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్‌లోనూ మాట్లాడబోనని స్పష్టత ఇస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నించారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ, సీమాంధ్ర నేతలతో వేర్వేరుగా సమావేశమైన చంద్రబాబు చివరకు పొలిట్‌బ్యూరో సమావేశంలో తెలంగాణ ఆకాంక్షపై వెనక్కి తగ్గడం వల్ల ఒరిగేదేమీ లేదని, గతంలో 2008లో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను మరోమారు అందజేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిద్దామని నచ్చజెప్పి ఒప్పించగలిగారు.తెలంగాణపై చంద్రబాబు మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతమే అనుసరిస్తారని భావిస్తూ వచ్చిన ఇతర రాజకీయ పక్షాలు ఈ పరిణామాలతో ఖంగుతిన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.