December 28, 2012

కరీంనగర్ కంట కన్నీరు చూశాను!




కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. ఆరు నియోజకవర్గాల్లో సుమారు 200 కిలోమీటర్లు నడిచి బెల్లంపల్లి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశించాను. కరీంనగర్ యాత్రలో నాకు లభించిన ఆదరణను జీవితంలో మరిచిపోలేను. ఏ గ్రామంలో అడుగుపెట్టినా ఇళ్లలో ఉన్న జనాలంతా రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారు.

రోడ్డు పక్కన మహిళలు బారులు తీరి నిలబడి హారతులిచ్చి స్వాగతం పలికారు. ఇదంతా ఒక కోణం. మరోవైపు వాళ్ల కష్టాలూ కన్నీళ్లూ స్వయంగా చూడగలిగాను. మిగతా జిల్లాల్లో ఎలాంటి సమస్యలు చూశానో ఇక్కడా అవే ఎదురయ్యాయి. ఏ పల్లెను పలకరించినా అదే దైన్యం. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కరెంటూ లేదు. మహిళల జీవితాలకు భరోసా లేదు. భద్రతా లేదు. పిల్లలు చదువుకునే వాతావరణం కనిపించలేదు.

ఎస్సారెస్పీ పాదాల చెంత ఉన్న జిల్లా ఇది. యాత్ర అంతటా 'బాబ్లీ' దుష్ప్రరిణామాలను కళ్లారా చూడగలిగాను. పత్తి, పసుపు, మొక్కజొన్న, వరి.. ఇలా ఏ పంట వేసిన రైతును కదిలించినా సంతోషం లేదు. రాత్రి కరెంటు కారణంగా రైతులు బావిలో పడి చనిపోయిన సంఘటనలు కలచివేశాయి. చితికిపోయిన చేనేత కుటుంబాలను కలిశాను. వాళ్ల అవస్థలు చూసి..ఉండబట్టలేక కాస్తయినా ఊరట కల్గించాలని జగిత్యాలలో చేనేత డిక్లరేషన్ ప్రకటించాను.

శ్రీరాంసాగర్ చివరి భూములకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో గనులున్నాయి. వాటిని ఉపయోగించుకొని ఆధారిత పరిశ్రమలు పెడితే యువతకు ఉపాధి లభిస్తుంది. సింగరేణి కార్మికుల కష్టాన్ని మరిచిపోలేం. బీడీ బాధితులు, గల్ఫ్ బాధితులు.. ఇలా ఎవరిని కదిలించినా కన్నీరే. ఇంత కష్టంలోనూ నన్ను చూడాలని, వాళ్ల కష్టాలు చెప్పుకొని నా సమక్షంలో గుండెబరువు దించుకోవాలన్న ఆశ వారిలో కనిపించింది. ముసలి, ముతక కూడా ఎముకలు కొరికే చలిలోనూ అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురుచూశారు. వీళ్లకెంత రుణపడి ఉన్నాను!