December 28, 2012

అదో బ్లాక్ మెయిలింగ్ పార్టీ



స్పష్టత ఇచ్చాం!
అందుకే గులాబీ నేతల గుండెల్లో రైళ్లు
తట్టుకోలేకనే కేసీఆర్ విమర్శలు
దీటుగా ఎదుర్కోవాలి: శ్రేణులకు బాబు పిలుపు

"తెలంగాణపై తేల్చిచెప్పాం. అందువల్లే తట్టుకోలేక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వి మర్శలు చేస్తున్నారు. వాటిని దీటుగా ఎదుర్కోవాలి. మనమిచ్చిన స్పష్టతతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2008లోనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాం. ఆ లేఖపై చర్య తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాం. ఎవరూ మమ్మల్ని విమర్శించే పరిస్థితి లేదు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెగేసి చెప్పారు. బ్లాక్ మెయిల్ చేస్తూ బతుకుతున్నపార్టీగా టీఆర్ఎస్‌ను దుయ్యబట్టారు.

పన్నెండేళ్లుగా ప్రజలకు ఏమి చేసిందీ ఆ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గుంపుల వద్ద ఆయన శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. చివరిరోజు యాత్రలో భాగంగా తనుగుల, పాపక్కపల్లి, వావిలాల, నగురం గ్రామాల వరకు 11.7 కిలోమీటర్లు నడిచారు. "మనది బడుగు, బలహీనవర్గాలకు చెందిన పార్టీ. అందుకే ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులను పంపాం. తెలంగాణని అభివృద్ధి చేసింది మనం. ప్రాంత సమస్యలు తీర్చింది మనమే. రేపటి తెలంగాణను అభివృద్ధి చేసేదీ మనమే. మనల్ని ఏ శక్తీ ఏమీ చేయలేద''ని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

అఖిలపక్షం అనంతర పరిణామాలపై వరంగల్ జిల్లా వెల్లంపల్లి బసలో ఆయన సమీక్ష జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కేసీఆర్ విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు." తెలంగాణలో ఎక్కడ ఉనికిని కోల్పోతామోనన్న భయంతో కేసీఆర్ మనపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై దీటుగా స్పందించాలి. అఖిలపక్షంలో మన వైఖరిని మిగతా పార్టీలూ హర్షిస్తున్నాయి. నిర్ణయం చెప్పకుండా కాంగ్రెస్ మాత్రమే నాన్చుతోంది''అని వివరించారు. కాంగ్రెస్‌తో కలిసి పాలించినప్పుడు తెలంగాణకు టీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలని చివరిరోజు పాదయాత్రలో భాగంగా జరిగిన సభల్లో ఆయన డిమాండ్ చేశారు.

తన కుటుంబసభ్యులకు ఉద్యోగాలు రావడంతో ఆనందించారే గానీ, మరో తల్లి బిడ్డల ఉపాధి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదంటూ కేసీఆర్‌ను విమర్శించారు. గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు సహా 14 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేసినా పట్టించుకోలేదని, గల్ఫ్ బాధితుల కోసమూ కేసీఆర్ ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. పిరికితనంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, పాదయాత్ర చివరి రోజున కరీంనగర్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ చివరి భూములకు నీరందేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని, ప్రాణహిత-చేవేళ్ల ప్రా జెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు పోరాడతామని ఆ ప్రక టనలో వెల్లడించారు.

కాగా, చంద్రబాబుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో మహిళలు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. గ్రామాలలో ఆయనకు ఎదురేగి డప్పులు మోగిస్తూ, టపాసులు పేలుస్తూ సందడి చేశారు. శంభునిపల్లి గ్రామ మహిళా రైతులు దారిలో కలిసి పత్తి పంటకు ధర రావడం లేదని మొర పెట్టుకున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట ఐకేపీ గ్రామ దీపికలు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని వినతి పత్రం సమర్పించారు. గోపాలపురంలో పత్తి ఏరే మహిళలను కలిసి సమస్యలు ఆరా తీశారు. తాము అధికారంలోకి వస్తే పత్తికి క్వింటాలుకు 5 వేల రూపాయల ధర ఇప్పిస్తామని గోడు వెళ్లబోసుకున్న మహిళా రైతుకు భరోసా ఇచ్చారు.

కరీంనగర్‌లో ముగిసిన పాదయాత్ర
ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు 11 మండలాలు, 90 గ్రామాల మీదుగా 14 రోజుల పాటు 181 కిలోమీటర్ల దూరం కరీంనగర్‌లో చంద్రబాబు పాదయాత్ర సాగింది. శుక్రవారం సాయంత్రం జమ్మికుంట మండలం నగరం గ్రామం మీదుగా వరంగల్ జిల్లాలో పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలో సాగిన చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా విశేష స్పందన లభించింది.