December 28, 2012

ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నా .... చంద్రబాబు

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో అవినీతిపరులను, నేర చరితులను అందలమెక్కించారని, కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతికి చోటు ఇవ్వలేదని నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఎపిపిఎస్సీలో అవినీతిపరులు ఉండటంతో ప్రతిభావంతులకు ఉద్యోగాలు రాలేదని, డబ్బున్న వారికే దక్కాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిపుంజయ రెడ్డి అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టాడని చంద్రబాబు ఆరోపించారు. తన పిఏ సూరీడు రికమండేషన్‌తో రిపుంజయ రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి ఎపిపిఎస్సీ సభ్యునిగా నియమించగా 2008కి ముందు ఇల్లు కూడా లేని అతను ఇప్పుడు కోట్లు సంపాదించాడని విమర్శించారు. టిడిపి అవినీతిరహిత పాలన అందించిందని, తిరిగి అధికారంలోకి వచ్చినా అదే పాలన అందిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటుందని, 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో పాటు కరెంట్ చార్జీలను కూడా తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చూస్తుందని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని అందిస్తుందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టిడిపియేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. కాగా రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్లి మిర్చి బజ్జీలు వేస్తున్న ఓ మహిళతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను కూడా బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా తెలంగాణ కారం ఎలా ఉందంటూ ఆ మహిళ ప్రశ్నించింది. ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నానని ఆయన జవాబిచ్చి అందరినీ నవ్వించారు.