November 20, 2012

మనసులో మాట -రైతన్నా.. రాలిపోవద్దు!









మన ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో కష్టం వస్తే ఎవరితో చెప్పుకొంటారు!? వారి కష్టాన్ని గుర్తించి, తీర్చాల్సిన బాధ్యత ఎవరిది!? తల్లిదండ్రులదే కదా! అలాగే, రైతన్నకు కష్టమొస్తే ఎవరితో చెప్పుకొంటాడు!? ప్రభుత్వానికే కదా! నిలువెత్తు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా! కానీ, ఇదేం ప్రభుత్వం!? దీనికి మానవత్వమూ లేదు. బాధ్యత అంతకంటే లేదు.

ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న వార్తను చదివి కలత చెంది ఈరోజు పాదయాత్రను ప్రారంభించా. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముగ్గురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. హరితాంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఉండవని పాలకులు చెప్పిన మాటలు నీటిమూటలేనని ఆ వార్త గుర్తు చేసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసి, అప్పుల బాధలు భరించలేక చనిపోయే పరిస్థితి రావడం దారుణం. తాము చేయని తప్పులకు రైతులు బలైపోతున్నారు.

ఈ ఆవేదనతో నడుస్తుండగానే, సదాశివపేట, సంగారెడ్డి రూరల్ మండలాల్లో పత్తి, చెరకు సాగు చేసిన రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ఎదురొచ్చారు. అకాల వర్షాలు, పెరిగిన ధరలతో కుదేలైపోయామని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మదన పడ్డారు. వారి కష్టాలు విన్న తర్వాత నా ఆవేదన మరింత పెరిగింది. ఈ ప్రభుత్వ విధానాలే రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి.

దిగాలు పడిన రైతులను పరామర్శించడానికి, కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు ధైర్యం చెప్పడానికే పాదయాత్ర మొదలుపెట్టా. వారి ఆవేదన విన్న తర్వాత నా బాధ్యత రెట్టింపు అయిందనిపించింది. అందుకే, 'అన్నదాతలూ.. అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దు!' అని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నా.
No comments :

No comments :