November 20, 2012

బాబు వెంట వికలాంగుడి యాత్ర, హామీలు తీరుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్

బాబు వెంట వికలాంగుడి యాత్ర
రెండు కాళ్లకూ కృత్రిమ అవయవాలను అమర్చినా.. చంద్రబాబు వెంట పాదయాత్రలో సాగుతూ పి. సునీల్‌కుమార్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. సునీల్‌కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా నర్సరావుపేట. చిన్నతనంలో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. యాత్ర ప్రారంభించి 50 రోజులు పూర్తయిన దరిమిలా చింతలపల్లి ఈద్గాకు వచ్చారు. చంద్రబాబుతో పాటు యాత్రలో పాల్గొన్నారు.

"పాదయాత్రలో పాల్గొనడం కొంత ఇబ్బందే. బాబు అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకంతో వచ్చా. వికలాంగుడినైన నేను నడవడం చూసి మరికొందరైనా నడుస్తారనుకుంటున్నా''నని 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. ముబారక్‌పూర్‌లో వృద్ధ దంపతులు బోయిని అంజయ్య, గంగమ్మలకు 2000 చొప్పున చంద్రబాబు ఇచ్చారు.

హామీలు తీరుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
పాదయాత్రలో భాగంగా చంద్రబాబు చేస్తున్న హామీలను నెరవేర్చే పనిలో ఎన్టీఆర్ ట్రస్టు తలమునకలుగా ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన రామారావు కుమారుడు మోహిత్ వైద్యం కోసం రూ.2.5లక్షలు, అదే జిల్లా పరిగికి చెందిన రాజేష్‌కు రూ.2.18 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన చిన్నారి వైద్యానికి సుమారు 3.5లక్షలు భరించేందుకు ముందుకొచ్చింది.

బాధితులను మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి పిలిపించి ఈ విషయం చెప్పినట్టు ట్రస్ట్ సీఈవో వెంకట్ మోటపర్తి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరు మధ్య ట్రస్టు ఆధ్వర్యంలో రూ.56లక్షలతో 130 వైద్య శిబిరాలు నిర్వహించి 83,869మందికి వైద్యసాయం అందించినట్లు ఆయన తెలిపారు.
No comments :

No comments :