November 20, 2012

రాజశేఖర రెడ్డి పాలన అంతా దోపిడీ, దుర్మార్గ పాలన

హైదరాబాద్/మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అంతా దోపిడీ, దుర్మార్గ పాలన అన్నారు. నిజమైన స్వర్గయుగం కేవలం చంద్రబాబుదే అన్నారు. అతి స్వల్ప కాలంలో వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించిందని, దానికి వారు సమాధానం చెప్పాలన్నారు.
ఈజి మనీ కోసం అలవాటు పడ్డ వారికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ రాజకీయ వేదిక అని టిడిపి నేత వేం నరేందర్ రెడ్డి వేరుగా అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమే విశ్వసనీయతా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే చంచల్‌గూడ జైలులో సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు విశ్వసనీయత గురించి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.
పవిత్ర గ్రంథంతో అబద్దాలు చెప్పడం విజయమ్మకు సరికాదని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నో కేసులు వేసి సాక్ష్యాలు లేక ఉపసంహరించుకున్నారన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పుడు అందర్నీ కొత్తవారినే తీసుకున్నారని టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. కొత్తవారిని ప్రోత్సహించారే తప్ప వలసలను ప్రోత్సహించలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి తాము విశ్వసనీయత తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపి సిఎం రమేష్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం పెట్టే తీరును చూసిన తర్వాత తాము నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు
సంతలో పశువుల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటోదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా పాదయాత్రలో అన్నారు. కాంగ్రెసు నేతలు పేదల సొమ్మును పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు. లంబాడీలకు న్యాయం చేసి పెద్ద నాయక్‌గా పేరు తెచ్చుకుంటానని, మందకృష్ణ మాదిగలా లంబాడీలు టిడిపికి మద్దతు తెలపాలని కోరారు.
నాయకత్వ లక్షణాలు ఉన్న వారి పేర్లను సూచిస్తే పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు గిరిజనులకు అవకాశం కల్పిస్తామన్నారు. 500 మంది జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. జవాబుదారితనాన్ని ప్రజల్లో తెలుగుదేశం పార్టీయే తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెసు పాలనలో మద్యం ఏరులై పారుతోందన్నారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపుల రద్దు ఫైలుపై సంతకం చేస్తానన్నారు.
No comments :

No comments :