November 20, 2012

నేను పార్టీ మారతానా,వైఎస్సార్‌సీపీది మైండ్ గేమ్

నిబద్ధతతో పనిచేస్తున్నా
నేను పార్టీ మారతానా
వైఎస్సార్‌సీపీది మైండ్ గేమ్
కంటతడిపెట్టిన పయ్యావుల కేశవ్

హైదరాబాద్, నవంబర్ 20 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, ఆ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఖండించారు. తాను టీడీపీలో నిబద్ధతతో ఓ సైనికుడిలా పనిచేస్తున్నానని, అలాంటిది తాను పార్టీ ఎలా మారతానని ప్రశ్నించారు. టీడీపీలోనే కొనసాగుతానని, ఏ పార్టీలోకి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీది మైండ్ గేమ్అని, వారు రాష్ట్రంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దుష్ప్రచారం జరుగుతుందని పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ తండ్రితోనే పోరాటం చేసిన తాను ఆ పార్టీలోకి వెళ్లే సమస్యే లేదని స్పష్టం చేశారు. వ్యూహంలో భాగంగా తనపై అసత్యాలు ప్రచారం చేసి గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు కాణిపాకం వినాయకుడి ఎదుట ప్రమాణం చేసి చెప్పాలని, వైఎస్సార్‌సీపీలోకి నేను వస్తానని వాళ్ళవద్దకు వెళ్లానా, లేక వాళ్ళు నావద్దకు వచ్చారా అన్న విషయం కూడా ప్రజలకు చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు.

తాను ఉదయం వార్తలు చూడగానే కంట నీరు వచ్చిందన్నారు. మీడియా సమక్షంలో కేశవ్ కంటతడి పెట్టుకున్నారు. తనకు పార్టీలో మంచి గౌరవం ఉందన్నారు. ఇలాంటి ప్రచారం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన, జగన్ అవినీతి పైన పోరాటం సాగిస్తానని చెప్పారు. జగన్ ఆయా జిల్లాల్లో బలమైన నేతలను టార్గెట్ చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల రెండుమూడుసార్లు ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో తాను పార్టీ మారుతాననే ప్రచారం బాధ కలిగించిందన్నారు. ఇదంతా గ్లోబెల్ ప్రచారం అన్నారు. ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం టిడిపికే లాభం అన్నారు. సంక్షోభం తలెత్తిన పలు సందర్భాలలో టిడిపి ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.

ఇప్పుడు అలాగే ఉంటుందని కేశవ్ ధీమా వ్యక్తం చేశారు. తాను సంపాదనపై ఆశలేకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడిగా పని చేస్తానన్నారు. వ్యూహాత్మకంగా తనను, టిడిపిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన పద్దెనిమిదేళ్ల రాజకీయంలో విలువలతో, సిద్ధాంతాలతో, కార్యకర్తగా, సైనికుడిగా పని చేశానన్నారు. రాజకీయాల్లో కొందరిలా ఆస్తులు సంపాదించుకునేందుకు తాను ప్రయత్నించడం లేదన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తనను పిలిచి టిక్కెట్ ఇచ్చారన్నారు. 20 ఏళ్లు కష్టపడి పెంచుకున్న ప్రతిష్టను ఒక్క కథనంతో చెడకొట్టారు. తాను జీవితంలో బాధపడిన రోజుల్లో ఇది ఒకటి అన్నారు. సంక్షోభాలు వస్తే టిడిపి మరింత బలోపేతం అవుతుందన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచినంత మాత్రాన ఆ పార్టీలోకి వెళ్లేంత బలహీనుడిని కాదన్నారు. జగన్ తండ్రిపై పోరాటం చేశానని, ఇప్పుడు జగన్ పైన చేస్తానన్నారు. తాను టిడిపి పునాదులపై పెరిగానన్నారు. అలాంటి పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు తన వివరణ తీసుకుంటే బాగుండునని పయ్యావుల చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిని వీడటం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.
No comments :

No comments :