November 17, 2012

నేటి నుంచి మెదక్‌లో పాదయాత్ర


టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఆదివారం మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి నుంచి పటాన్‌చెరు మండలం బీడీఎల్ గేటు వద్ద జిల్లాలో ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. బాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పది రోజులు జిల్లాలో పాదయాత్ర చేసి, ఈనెల 27న నిజామాబాద్ జిల్లాకు చంద్రబాబు వెళ్తారు.

పటాన్‌చెరు, సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలలో 167.2 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర ఉంటుంది. జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ ప్రభావం అధికంగా ఉన్న సిద్దిపేట, దుబ్బాకల వైపు వెళ్లకుండా చూసుకున్నది. ఇబ్బందులు అంతగా ఎదురుకాని పటాన్‌చెరు నుంచి ఇతర ప్రాంతాలను గుర్తించి.. రాష్ట్ర, జిల్లా ముఖ్యనాయకులు పర్యటించిన తర్వాతే ఈ మార్గాన్ని ఖరారుచేశారు.

మరోవైపు, తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్న డిమాండ్‌తో మెదక్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ జేఏసీ నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు జరపాలని నిర్ణయించిది. పాదయాత్రకు అడ్డంకులు కల్పించకుండా.. బాబు జిల్లాలో ఉన్నన్ని రోజులు ఎక్కడో ఒకచోట ఈ నిరసనలు జరిపేలా జేఏసీ చూస్తోంది. ఇందుకు సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇతరులను ర్యాలీలలో పాల్గొనాలని సూచించింది.
No comments :

No comments :