November 17, 2012

ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వదు కాని మందు మాత్రం ఇస్తుంది

అధికారం ఇవ్వండి.. రుణం తీర్చుకుంటా
ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వదు కాని మందు మాత్రం ఇస్తుంది
నేటి నుంచి మెదక్‌లో బాబు పాదయాత్ర
ఐదు నియోజకవర్గాలు.. మొత్తతం 167.2 కిలోమీటర్ల నడక

రంగారెడ్డిజిల్లా, నవంబర్ 17 : తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలో గుజరాత్ కంటే ముందు నిలిపి ప్రజల రుణం తీర్చుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా శనివారం ఆయన రంగారెడ్డిజిల్లా శంకరపల్లిలో పాదయాత్ర కొనసాగించారు.

శంకరపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి వల్ల అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని వైఎస్, ఆయన తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని దీని వల్లే రాష్ట్ర ప్రజలకు కష్టాలు వచ్చాయని చెప్పారు. వీరి అవినీతి వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టిందని ఇప్పుడు మేలుకోకుంటే సుడిగుండంలో నుంచి అగ్నిగుండంలో పడిపోతారన్నారు. టీడీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతానని చెప్పారు.

రైతన్నకు అండగా ఉంటామని బడుగు, బలహీనవర్గాల వారికి, అగ్రవర్ణాల పేదలకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రజలకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్.. మందు మాత్రం ఇస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆరునెలలు ఇంట్లో పడుకుని ఒక రోజు లేచి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ వాళ్లు జైలునే పార్టీ కార్యాలయంగా మార్చేశారని పేర్కొన్నారు. కేసులు మాఫీ చేయాలని కాంగ్రెస్‌తో రాయబేరాలు సాగిస్తున్నారన్నారు. కేసులు ఎత్తివేస్తే పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

జైల్లో ఉన్న అవినీతి పరులు , మాటల గారడీలు చేసే వారు విశ్వసనీయత గురించి తనని ప్రశ్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రతి ఎకరాన్ని తాను అభివృద్ది కోసం కేటాయిస్తే వైఎస్ మాత్రం దోచుకుతిన్నారని ఇదంతా ఆయన తాతజాగీరా? అని ప్రశ్నించారు. వైఎస్ ఆయన తరువాత వచ్చిన వారి అవినీతిని భరించలేక పారిశ్రామిక వేత్తలు రాష్ట్రాన్ని విడిచి పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటల గారడీకి చింతకాయులు రాలతాయా? తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. కొందరు మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని వ్యాపార పార్టీలు, దోపిడీ పార్టీలు, భ్రష్టుపట్టించే రాజకీయాలు నడిపే పార్టీలను సాగనంపాలన్నారు.
No comments :

No comments :