November 17, 2012

ఇంచార్జీలుగా ఉన్నంత మాత్రాన తామే అభ్యర్థులమని అనుకోరాదని, పని చేయకపోతే వేరే అభ్యర్థులను ఖరారు చేస్తా...

 పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. తానొక్కడినే రోడ్డు మీద పడి తిరుగుతున్నానని, నాయకుల్లో సీరియస్‌నెస్ కనిపించడం లేదని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ ఇంచార్జీలు అలంకార ప్రాయంగా ఉంటే లాభం లేదని ఆయన అన్నారు. ముందుగానే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
ప్రజల్లో ఉన్నవారినే అభ్యర్థులుగా ప్రకటిస్తానని ఆయన అన్నారు. అజాగ్రత్త పనికి రాదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాసుఖాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్పీ లోకసభకు అభ్యర్థులను ప్రకటించడాన్ని, కాంగ్రెసు పార్టీ కమిటీలు వేసుకోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దపడుతున్నాయని ఆయన అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంచార్జీలుగా ఉన్నంత మాత్రాన తామే అభ్యర్థులమని అనుకోరాదని, పని చేయకపోతే వేరే అభ్యర్థులను ఖరారు చేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు నేతలు జైలు నుంచే రాజకీయాలు నడుపుతున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ్యులకు ప్రత్యేక ప్యాకేజీలు ఎరు చూపి కొనుగోలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
వైయస్సార్ కాంగ్రెసు నాయకుల వద్ద టన్నుల కొద్ది డబ్బులున్నాయని ఆయన అన్నారు. విలువలు లేని రాజకీయాలతో ఎవరైనా పార్టీలు మారితే వారే చరిత్రహీనులవుతారని అన్నారు. ఏ త్యాగం చేసి జగన్ జైలుకు వెళ్లారో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రజల మధ్యకు వచ్చి ధైర్యంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంపాదించిన డబ్బుకు లెక్కలు కూడా చెప్పలేని స్థితిలో జగన్ జైలుకు వెళ్లారని ఆయన ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన అడిగారు. హైదరాబాదును కుంభకోణాల రాజధానిగా మార్చిన ఘనత కాంగ్రెసు పార్టీదేనని వ్యాఖ్యానించారు. నీలం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా సరఫరా చేయలేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పాల్గొన్నారు. రేపు ఆదివారం పాదయాత్రలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ పాల్గొంటారు.
No comments :

No comments :