November 27, 2012

వర్గీకరణ చేసి మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్

అవినీతిపై పోరాటం చేసిన పార్టీ టీడీపీయే : చంద్రబాబు

మెదక్, నవంబర్ 27 : మాదిక వర్గీకరణ చేసి మీ రుణం తీర్చుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచి ఆదుకంటామని అన్నారు. డీఎస్సీలో బిఈడీ అభ్యర్ధులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా...మీకోసం పాదయాత్ర మంగళవారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. కాగా మెదక్ జిల్లాలో పదవరోజు కొనసాగుతోంది. ఈ ఉదయం పెద్దశంకరం నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. జలయజ్ఞానాన్ని ధన యజ్ఞం చేస్తే టీఆర్ఎస్ మాట్లాడలేదని బాబు ఆరోపించారు.

ఆరు నెలలు పడుకోని లెచి ప్రజల మధ్యకు వచ్చి కేసీఆర్ ఏవోవే వాగ్ధానాలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాటం చేసింది ఒక్క టీడీపీయేని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

అంతకు ముందు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్దశంకరంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలోని సమస్యలను విద్యార్థులు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. కళాశాలకు మంచినీళ్లు, లైబ్రరీ ఇతర సౌకర్యాల కోసం ఎంపీ లాడ్స్ నుండి రూ.2 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా యాత్ర ప్రారంభించే ముందు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈరోజు మొత్తం 15 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.