November 27, 2012

ఏం కొనేటట్టు లేదు! చంద్రబాబు

ఏం కొనేటట్టు లేదు!

ఆ గ్రామాల గుండా వస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసుకునే మహిళా కూలీలంతా గుంపుగా కదలివచ్చారు. నా చుట్టూ గుమిగూడి తమ కష్టాలు ఏకరవు పెట్టారు. కూలి చేసుకుంటుంటే వచ్చిన డబ్బులతో నెల గడిచే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. అదీ ఇదీ అని లేకుండా నిత్యావసరాల నుంచి కూరగాయల వరకు మండిపోతున్నాయని పెద్దశంకరంపేటలో ఎదురొచ్చిన జనం వాపోయారు. వాళ్ల ఆవేదనలో నిజం ఉందనిపించింది. ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్నవాళ్లే అగ్నిగుండంలోకి తోస్తున్నారనిపించింది.

ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల ఆదాయాన్ని, ఖర్చును సమన్వయం చేస్తూ పాలసీలు తయారుచేయాలి. కానీ ఆ ముందుచూపు లోపించింది. ఆ దెబ్బ సామాన్యుడిపై పడుతోంది. మండే ఎండలకు పక్షులు, జీవాలు రాలిపోయినట్టే మండే ధరలకు సగటు ప్రజలు కూలిపోతున్నారు.

విద్య కోసమో, వైద్యం కోసమో అప్పు చేశారంటే అనుకోవచ్చు. కారపు మెతుకులు తినేందుకు కూడా తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికి పేదలు నెట్టేయబడుతున్నారు. చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉప్పూ పప్పులు నిప్పుల్లా కాలుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో వాత పెడుతున్నారు. గ్యాస్ ధరలు వంటిళ్లను మండిస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ముందు ఆలోచన ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. వీళ్లకు ఇన్ని కష్టాలూ లేకపోయేవి.

రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఏటా ఏ సరుకు ఎంత ఉత్పత్తి అవుతోంది, ఎంత వినియోగం అవుతున్నదనే అంచనా ఉండాలి. ఎగుమతులూ దిగుమతులపై కూడా కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలి. టీడీపీ హయాంలో అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి ఎప్పటికప్పుడు ధరల నియంత్రణను పరిశీలించేవాడిని. దాంతో ధరలెప్పుడూ గీత దాటేవి కాదు. కానీ, ఇప్పుడు పాలించేవాళ్లలాగే ధరలూ కట్టుతప్పాయి. వాటిని కట్టడి చేయకుండా ప్రగతిబాటలో కాలు ముందుకేయడం కష్టమనిపిస్తోంది.