November 27, 2012

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ఆదేశాలు -వర్ల రామయ్య

పామర్రు, నవంబర్ 27 : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఈ నెల 28న విడుదల చేయకపోతే చంచల్‌గూడ జైలు గోడలు బద్దలకొట్టి బయటకు తీసుకురావాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ జగన్ విడుదలపై ఈనెల 28న సీబీఐ కోర్టులో బెయిల్‌పై తీర్పు వెలువడనుండగా ఉదయభాను పైవిధంగా వ్యాఖ్యానించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

సుప్రీం కోర్టు 2013 మార్చి వరకు జగన్ బెయిల్ పిటిషన్ వేయడానికి వీలులేదని సూచించినా సామినేని కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేయడం చట్టాన్ని అగౌరవ పర్చడమేనన్నారు. ఉదయభాను బెదిరింపులు ఎవరిపై అనేది కూడా దర్యాప్తు చేయాలన్నారు. మితిమీరిన ఆర్థిక నేరాలు చేసి జైల్‌లో ఉన్న జగన్ బృందం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదనే విషయం ఆపార్టీ నేతలు గమనిస్తే మంచిదన్నారు.

సామినేని వ్యాఖ్యలను బట్టి ఆయనపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని, చంచల్‌గూడ జైల్‌లో ఉన్న జగన్మోహనరెడ్డిని కలిసేవారిపై కూడా నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జగన్ వ్యవహారంపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, ఫలితంగా జగన్ జైల్‌లో నుంచే రాష్ట్రవ్యాప్తంగా తన బృందాలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ఆదేశాలిస్తున్నట్లు ఉదయభాను వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

భాను పిచ్చి ప్రేలాపనలు: ఉమా
మైలవరం, నవంబర్ 27 : జైలు గోడలు బద్దలుకొట్టి జగన్‌ను బయటకు తీసుకువస్తామని భాను చేసిన వ్యాఖ్యలు పిచ్చి ప్రేలాపనలని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం టీడీపీ కార్యాలయంలో మంగళవారం స్థానిక విలేకర్లతో ఉమా మాట్లాడారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను జైలు గోడలు పగులగొడతామని అనడం అప్రజాస్వామికమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జగన్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు.

ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలన్నారు. ఇలాంటి ఆరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఇలాంటివారు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తుల్ని సైతం కొల్లగొడతారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు సకల సదుపాయాలు అందుతున్నాయన్నారు. శాటిలైట్ ఫోన్‌తో సహా రాచ మర్యాదలు చేస్తూ తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.