November 26, 2012

ఆదరణ ఏదీ..! చంద్రబాబు

  ఆదరణ ఏదీ..!

ఇప్పుడు నేత దుస్తులకు ఆదరణ ఎక్కడుంది!? అలా వెళ్లడం.. ఇలా రెడీమేడ్ దుస్తులు కొనుక్కు రావడం! దీంతో, నేతన్నలూ నష్టపోతున్నారు. దర్జీలకూ ఉపాధి కరువైంది!

పేదవాడి ఫ్రిజ్జు అయిన కుండకు ఆదరణ ఏదీ!? దీపావళికి ప్రతి ఇంటా మట్టి దీపాలు కళకళలాడేవి. అనారోగ్యకారకమని తెలిసినా.. ఇప్పుడన్నీ ప్లాస్టిక్ బిందెలు. రెడీమేడ్ దీపాలే! ఇళ్ల నిర్మాణంలో.. ఇంట్లో విడిచిన దుస్తులను భద్రపరచడం సహా పలు పనులకు బుట్టలు, గంపలు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ గంపలు, టబ్‌లు వచ్చేశాయి!

ప్రపంచీకరణ ఫలితంగా చేతి వృత్తులు, కుల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి ప్రమాదాన్ని ముందుగా ఊహించే టీడీపీ హయాంలో చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు ఇచ్చి కొంతవరకు ఆదుకున్నాం. కానీ, ఈ ప్రభుత్వానికి ముందు చూపు ఏదీ!? సోమవారంనాటి పాదయాత్రలో బుట్టలు అల్లేవారు, నేతన్నలు, కుమ్మర్లు, చేతివృత్తిదారులు వచ్చి కలిశారు. తమ ఉత్పత్తులకు గిరాకీ లేకుండాపోయిందని, ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం బాధ్యత కలిగినది అయితే వారికి పునరావాసం కల్పించడమో.. మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి చేయూత ఇవ్వడమో చేయాలి! కానీ, తన విధానాలతో వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో, చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందనే దానిపై దృష్టిసారించా. చైనా అనుభవం ఆసక్తికరంగా ఉంది. చేతివృత్తిదారులు కుటీర పరిశ్రమల్లో పనిచేస్తారు. అక్కడే అన్నిటినీ తయారు చేస్తారు. వాటిని ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. రాష్ట్రంలోనూ అటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని నిర్ణయించాను.