November 23, 2012

మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని కాపాడుకుంటా 22.11.2012



మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు
'మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని కాపాడుకుంటా'నని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. పెద్దచల్మెడలో జరిగిన సభలో పలువురు పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ్మ అనేక రకాలుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని బాబు దృష్టికి తీసుకువచ్చారు.

ఇందుకు స్పందించిన టీడీపీ అధినేత.. "డిప్యూటీ సీఎం వైఖరికి నిరసనగా ధర్నాలు చేయండి. మీకు అండగా మీ నాయకుడు బాబూమోహన్ వస్తారు. జిల్లా నాయకులు వచ్చి ఆందోళన చేస్తారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోతే నేనే ఆందోలు వచ్చి రాజనర్సింహ గుండెల్లో నిద్రపోతా'' అని చంద్రబాబు హెచ్చరించారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఊర్కోనన్నారు.

రాత్రి పూట ఇక చంద్రుడే దిక్కు
రాష్ట్రంలో ఇక రాత్రి పూట కూడా కరెంట్ ఉండదని, మీకు చంద్రుడే దిక్కు అని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విద్యుత్తు వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో కరంటోళ్లకే కాకుండా చివరికి దేవుడికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కానీ, రాని కరెంట్‌కు బిల్లులు, సర్‌చార్జీలు వేసి కాంగ్రెస్ పాలకులు వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తా
తెలంగాణ సాధనలో భాగంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. జీర్లపల్లి సమీపంలో సామాజిక తెలంగాణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సతీష్ మాదిగ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ కోసం 900 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వీరి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ఇందుకు స్పందించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. తెలంగాణను టీడీపీ ఎన్నడూ వ్యతిరేకించలేదని, వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్‌లోనూ వ్యతిరేకించేది లేదని పునరుద్ఘాటించారు.

తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరామని, అయినా కేంద్రం పెట్టడం లేదని, నిర్ణయం తీసుకోవాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను అడిగితే నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణపై కావాలనే డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంలో మరో అడుగు ముందుకు వేసిన చంద్రబాబు.. మొదటిసారిగా అమరులు, వారి కుటుంబాల గురించి ప్రస్తావించడం పార్టీ వర్గాల్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది.
No comments :

No comments :