November 23, 2012

ప్రభుత్వం ఏర్పాటు చేసి మాఫీ చేస్తా, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు అడగడమా?



రుణ మాఫీకి కాంగ్రెస్ వ్యతిరేకం
ప్రభుత్వం ఏర్పాటు చేసి మాఫీ చేస్తా
అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు అడగడమా?
కరెంట్ కష్టాలకు రోశయ్య, కిరణ్‌లే బాధ్యులు : చంద్రబాబు
సంగారెడ్డి, నవంబర్ 23 : రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని 2009కి ముందు తాను, ములాయంసింగ్, జయలలిత కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. మెదక్ జిల్లాలో జరుపుతున్న పాదయాత్రలో భాగంగా ఆరో రోజయిన శుక్రవారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలలో జరిగిన సభలలో ప్రసంగించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కూడా రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని, అందువల్లరుణాల మాఫీ అవసరం లేదని కేంద్రానికి లేఖ కూడా రాశారని చెప్పారు. రుణ మాఫీకి బదులుగా రైతులకు అయిదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని వైఎస్ సూచించారన్నారు. అయితే తామందరం చేసిన ఒత్తిడి వల్ల కేంద్రం రుణ మాఫీకి అంగీకరించిందన్నారు.

రుణ మాఫీ ఎలా చేస్తారని, ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయిస్తారని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి అడగడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 'పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారు, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు నన్ను అడగడమా?' అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు రైతుల రుణాలను ఎలా మాఫీ చేయాలో తెలుసన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వైఎస్ అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారని, కాని ప్రతి రోజు నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంట్ కష్టాలకు రోశయ్య, కిరణ్‌లే బాధ్యులు

రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో కరవు వచ్చినా రైతులకు తొమ్మిది గంటల కరెంట్ సరఫరా చేశామని చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కరెంట్‌ను నిర్లక్ష్యం చేశారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వందరూపాయల ఆదాయం వస్తే 8 రూపాయలు కరెంట్ కోసం ఖర్చు చేశామని, వైఎస్ సీఎం అయ్యాక 4 రూపాయలే ఖర్చుపెట్టారని చెప్పారు.

ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబితే మంత్రులు, ఎమ్మెల్యేలు వినడం లేదని, అధికారులు కూడా వినరన్నారు. అసమర్థ సీఎం వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి వల్లే మనం కష్టాల్లో బతకాల్సి వస్తున్నదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల సీఎం కాదని, సీల్డ్‌కవర్ సీఎం అని విమర్శించారు. ఢిల్లీ నుంచి సోనియాగాంధీ సీల్డ్‌కవర్‌లో పంపిస్తే ఈయన సీఎం అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేల చేత ఎన్నికైన వ్యక్తి కాదని, అందుకే ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేశానని సంబరాలు చేసుకుంటున్న కిరణ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రజాసంక్షేమ పనికి ఏదో అడ్డంకి సృష్టించి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ అదనంగా మూడు సిలిండర్లు ఇవ్వాలని సోనియాగాంధీ చెబితే దీపం పథకం వారికే ఇస్తామంటూ కిరణ్ కిరికిరి పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

No comments :

No comments :