November 23, 2012

.. గుర్తుకొస్తున్నాయీ..! చంద్రబాబు



జన్మభూమి.. ఈ కార్యక్రమం అనగానే అప్పట్లో గ్రామగ్రామానా ఓ పండుగ వాతావరణం! శ్రమదానం.. గ్రామస్తులందరూ ముందుకు వచ్చి తమ సమస్యలను తామే పరిష్కరించుకుని, గ్రామానికి ఆస్తులనూ సమకూర్చుకున్న పవిత్ర కార్యక్రమం! పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లాలోని పెద్ద చెల్మడ, జీర్లపల్లి గ్రామాల్లో ప్రజలు గ్రామసభను ఏర్పాటు చేశారు. చెట్టు కిందే కూర్చుని మంచీ చెడూ మాట్లాడారు. టీడీపీ హయాంలో శ్రమదాన కార్యక్రమంలో భాగంగా ఫలానా చెరువును అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ పూడిక వచ్చేసిందని, పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామాలకు వెళ్లడానికి ముందే మార్గమధ్యలో కొన్ని చెక్‌డ్యాములను చూశాను.

అవన్నీ నా హయాంలో ఏర్పాటు చేసినవే. అక్కడ చెక్‌డ్యాములు చూశాక.. ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను. నా హయాంలో చేసిన గ్రామసభలే గుర్తుకు వచ్చాయి. జన్మభూమి, శ్రమదానం తదితర పథకాలు మదిలో మెదిలాయి.

ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు చేరాలని, ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఆ పథకాలకు రూపకల్పన చేశాను. గ్రామాలకు వెళితే కుటుంబ సభ్యులుగా వచ్చి సమస్యలు చెప్పుకొనేవారు. అధికారం ఉంది కనక అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేవాడిని. కన్నతల్లి కంటే జన్మనిచ్చిన భూమి గొప్పదన్న ఉద్దేశంతో జన్మభూమి పెట్టా. గ్రామస్తులంతా ఏకమయ్యారు. విదేశాల్లోని తెలుగువారూ చేయూతనిచ్చారు.

కానీ, ఇప్పుడో!? ఏకతాటిపై ఉండే ఊరు ఇప్పుడు రాజకీయాలకు నిలయంగా మారింది. ఎవరికి ఎవరూ కాకుండా పోయారు. గ్రామాల్లో మళ్లీ ఆ స్ఫూర్తి రావాలి. ఆ ప్రశాంత వాతావరణం ఏర్పడాలి. శ్రమదానంతో చేయీ చేయీ కలిపే పరిస్థితి రావాలి. జై జన్మభూమి!

No comments :

No comments :