October 18, 2012

ఏమిటీ మహిళల దైన్యం? chandrababu naidu padayatra 17th day

. బాల వాక్కు బ్రహ్మ వాక్కంటారు. అదెంత నిజమో తెలియదు. కానీ నన్ను చుట్టుకొని తిరుగుతూ, తమ బుడిబుడి అడుగులతో నన్ను అందుకునేందుకు వాళ్లు పడుతున్న తిప్పలు ముద్దొస్తున్నాయి. నడకలో ఆటవిడుపుగానేకాక, ఇన్ని సమస్యలు వింటున్నా, దారిలో కనిపించిన దారుణ సంగతులు కలచివేస్తున్నా ఉత్సాహంగా నన్ను ముందుకు నడిపిస్తున్నది పసితనం వదలని చిన్నారుల మాటలే. ఏమి చేస్తే ఆ లేత కళ్లల్లోని అమాయకత్వాన్ని కాపాడుకోగలను?

అప్పుడు మాటల పుట్టలు.. ఇప్పుడు సమస్యల పుట్టలు.. ఎమ్మిగనూరు దారిలో ఆ మహిళతో మాట్లాడేప్పుడు ఇలాగే అనిపించింది. "సీతాఫలాలు అమ్ముతాను సార్. ఈ దారిన పోయే మీ లాంటోళ్లు కొంటే ఆ రోజుకు తిండి. లేదంటే లేదు. ఊళ్లలో అమ్ముకోడానికి ఎవరు ఉన్నారు సార్. అంతా వలస పోతిరి. నాలాగే వాళ్లూ రోడ్డున పడితిరి. అందరం రోడ్డుపైనే ఉన్నాం సార్. మీరైనా కొంటే ఆ డబ్బుతో ఇంటికెళ్లి వండుకుంటా సార్'' అంటూ జయలక్ష్మి బాధల మూట విప్పింది.

"ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉందా అమ్మా'' అని నేను అడిగినప్పుడు ఎగదన్నిన ఆవేశం వల్లనో ఏమో దడదడగా మాట్లాడింది. "ఏమి చెప్పాలి సార్ మా బాధలు. అప్పుడెప్పుడో నువ్వు ఇచ్చిన గ్యాస్ బండ. తరువాత వచ్చినోళ్లు ఏమీ ఇయ్యకపోయినా దొంగ కార్డులంటూ ఉన్న తెల్లకార్డునూ లాగేసుకున్నారు. పళ్లు అమ్ముకునేవాళ్లం.. ఆ పాపపు పని చేస్తామా? అయినా వినలేదు. గ్యాస్ పొయ్యిపైన ఎసరుకు బియ్యం లేకుండా చేశారు. ఇప్పుడేమో గ్యాస్‌బండ పిరెం చేసి పొయ్యి కింద మంటని కూడా ఆర్పేశారు సార్'' అని కన్నీళ్లు పెట్టుకొంది.

జయలక్ష్మి లాంటి చిన్నిచిన్న బేరగాళ్లకు చన్నీళ్లకు వేన్నీళ్లలా ఉంటాయనుకున్న పొదుపు సంఘాలు కడకు కడగండ్లనే మిగిల్చాయని, రెండు రూపాయలు వడ్డీలు కట్టలేక, అప్పూ తీరక వారందరివీ కప్పులేని బతుకులయిపోయాయని ఆమె మాటల్లో తెలుసుకొన్నప్పుడు బాధనిపించింది. సీమలోనే కాదు.. తమ బతుకుల్లోనూ అన్నీ కరువేనని చివరకు మరుగుదొడ్డి వసతి కూడా లేదని చెబుతుంటే ఆడమనిషైనా కూడా బయటకు ఇలా చెప్పడం మహిళల దైన్యాన్ని కళ్లకు కట్టింది. డబ్బులిచ్చి బుట్టలోంచి కొన్ని పండ్లు తీసుకొని అక్కడి నుంచి కదిలాను.
No comments :

No comments :