October 18, 2012

17వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర విశేషాలు.18.10.2012


పెరుగుతున్న కాలునొప్పి

పాదయాత్ర 17వ రోజుకు చేరింది. చంద్రబాబుకు కాళ్ల నొప్పులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా నడిచేటప్పుడు ఆయన కుడి కాలు నొప్పితో బాధ పడుతున్నారు. గురువారం నొప్పి ఇంకా పెరుగుతున్నట్లు అనిపించడంతో తారు రోడ్డుపై కాకుండా రోడ్డు అంచున ఉన్న మట్టిపై నడవడం మొదలుపెట్టారు. నిర్ణీత వేళలకు మించి పాదయాత్ర జరుగుతుండడం, విశ్రాంతి తక్కువ కావడం కూడా బాబుకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం రాత్రి ఆయన నిద్రించేసరికి 12 దాటింది.

గురువారం ఉదయం 10 గంటలకల్లా బయటకు వచ్చి రోజువారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈలోపే తాను రోజూ క్రమం తప్పకుండా చేసే యోగా, ట్రెడ్‌మిల్, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు, కాలకృత్యాలు పూర్తి చేసుకున్నారు. ఇవన్నీ ఉదయమే జరగాల్సి రావడంతో ఆయన నిద్రపోయే సమయం తగ్గిపోతోందని, దీనివల్ల కూడా అలసట పెరుగుతోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర రోజూ సరాసరిన 20 కిలోమీటర్ల వరకూ ఉంటోంది. దానిని కనీసం 15 కిలోమీటర్లకు తగ్గించాలంటూ పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నా చంద్రబాబు అంగీకరించలేదు.

అధైర్యపడొద్దు
వివిధ వర్గాలతో ముఖాముఖిలో చంద్రబాబు

పాదయాత్రలో చంద్రబాబు రైతులు, మహిళలు, గొర్రెల కాపరులతో మాట కలిపారు. వారి కష్టసుఖాలను తెలుసుకొని ఓదార్చారు.

బాబు: ఏవయ్యా.. ఎలా ఉన్నావు? ఏ పంటను సాగుచేశావు?
నరసన్న (రైతు): వేరుశనగ పంట ఎండిపోయింది. ఆరెకరాల్లో సాగు చేశాను. వానలు లేక పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడి కూడా రాదు.
బాబు: అధైర్యపడొద్దు. మేము అధికారంలోకి వస్తే మీ రుణాలు మాఫీ చే యిస్తా.

బాబు: మీకు ఎలాంటి సాగునీటి ఆధారం లేదా? చెక్‌డ్యాంలు నిర్మించాం కదా?
దొడ్డయ్య: వర్షాధారంతోనే బతుకుతున్నాం. ఒకప్పుడు కనుమదొడ్డయ్య చెరువు ఉండేది. ఇప్పుడది పూడిపోయింది. చెరువు నిర్మించండి.

అక్కమ్మ: సార్! వచ్చే రూ.200 పింఛన్‌తో బతకడం కష్టంగా ఉంది.
బాబు: మా ప్రభుత్వం వస్తే రూ.600 పింఛన్ ఇప్పిస్తా. ఖర్చులకు 5 వేలు ఉంచుకో.

విజయ్‌గౌడ్: సార్.. మీరు ప్రధాన మంత్రి అయితే మా సమస్యలన్నీ తీరతాయి.
బాబు: మీ అభిమానానికి ధన్యవాదాలు. 

ఈత చెట్టెక్కిన బాబు

పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు సమీపంలోని కొటేకల్లు వద్ద చంద్రబాబు గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఈదు (ఈతవనం)లో కల్లుకుండ పట్టుకుని కొంతవరకు ఈత చెట్టు ఎక్కారు. టీడీపీ హయాంలో గీత కార్మికుల సంక్షేమం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించారని, ఈ ఏడేళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు తీరాలంటే బాబు ప్రధాని కావాలని కోరుకున్నారు.

మీరు సీఎం అవుతారు సార్!
బాబుపై మూడో తరగతి బుల్లోడి అభిమానం

  ఆ చిన్నారి పేరు ఈడిగ గోపాల్. చదివేది మూడో తరగతి. చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం. బాబు ఎమ్మిగనూరు వస్తున్నారని తెలుసుకున్నాడు. పుస్తకం కొనుక్కోవాలంటూ తండ్రి దగ్గర మూడు రూపాయలు తీసుకున్నాడు. ఆటో ఎక్కి వచ్చేశాడు. ఎమ్మిగనూరు సరిహద్దు కోటేకల్ వద్ద బాబును చూడగానే పరుగున వెళ్లి నమస్తే సార్ అంటూ కరచాలనం చేశాడు. 'సార్ మీరు మరోసారి సీఎం అవుతారు' అంటూ తన అభిమానాన్ని చాటాడు. దాంతో, 'నీకు ఓటు హక్కు ఉండి ఉంటే నన్ను ఇప్పుడే సీఎంను చేసేలా ఉన్నావు' అని బాబు చమత్కరించారు. 

chandrababunaidu vastunna meekosam padayatra 18.10.2012 hilights




No comments :

No comments :