October 24, 2012

జగన్‌కు జైలులో ఎవరికీ లేని సౌకర్యాలు ,విచ్చలవిడిగా సెల్ ఫోన్‌ సౌకర్యం,రాజకీయ భేటీలు

అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జైల్లో ఉండే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జైల్లో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, విచ్చలవిడిగా సెల్ ఫోన్‌ సౌకర్యం కల్పించారని, ఎవరికీ లేని సౌకర్యాలు కల్పిస్తున్నారని, జైలులో రాజకీయ భేటీలకు అవకాశం కల్పిస్తున్నారని వీటిపై తాము తాము రాష్ట్ర డిజిపికి లేఖ రాశామని యనమల అన్నారు. లేఖ రాసి మూడు రోజులు గడిచినప్పటికీ ఎలాంటి సమాధానం లేదన్నారు. జగన్‌ను ఎవరెవరు కలుస్తున్నారో ఎందుకు రికార్డు చేయడం లేదన్నారు. సిసి కెమెరాలు ఉన్నప్పటికీ వాటిని రికార్డ్ చేసినట్లుగా కనిపించడం లేదన్నారు. వీడియో ఫుటేజ్‌లు ఉంటే వెంటనే వాటిని మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించే అంశంపై అవసరమైతే తాము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తామన్నారు. జగన్ జైలులో ఎవరెవరిని కలుస్తున్నారో ప్రభుత్వం బయట పెట్టాలని ఎనమల డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కారం కాలేదని పులివెందులలో జగన్ సోదరి షర్మిల చెప్పడంపై యనమల మాట్లాడుతూ.. పులివెందుల అభివృద్ధి కాలేదని షర్మిల చెప్పారని, అలాగే ప్రజలు కూడా చెబుతున్నారని, మరి ఎందుకు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదో వైయస్ కుటుంబమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పులివెందులను 35 ఏళ్లుగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే ఏలుతుందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వారి పైనే ఉందన్నారు. వైయస్ కుటుంబం ఇన్నేళ్లుగా పులివెందుల సమస్యలను పరిష్కరించనందుకు సమాధానం చెప్పాలన్నారు. ఇంతకాలం పులివెందులను ఏలుతూ అభివృద్ధి చేయని వైయస్ కుటుంబం ఇక రాష్ట్ర సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కు అయింది జగన్ పార్టీయే అన్నారు. తన పైనున్న కేసులు ఎత్తివేయించుకోవడానికి జగన్ కేంద్రంతోనూ రాజీ పడ్డారని ఆరోపించారు. పాలనా అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలను తీరుస్తుందన్నారు. రాష్ట్ర సంపదను మొత్తం కాంగ్రెస్ పెద్దలు రోచుకున్నారని ఎనమల ఆరోపించారు.
No comments :

No comments :