October 24, 2012

సుదీర్ఘ ప్రణాళికతో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం మంచిదికాదు -కె.నారాయణ, సిపిఐ

టిడిపి రాజకీయ ప్రచార యాత్రను ''మీకోసం వస్తున్నా'' పేరుతో సుదీర్ఘ ప్రణాళికతో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పాదయాత్రను ప్రారంభించారు. ఆ పార్టీ నిర్ణయించిన విధానాల రూపకల్పనలో భాగంగా వారు ప్రచారం సాగిస్తున్నారు. అయితే పాద యాత్రను, ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాలను తెలంగాణ ఐకాస అడ్డుకోవడం ప్రజాస్వామ్య విజ్ఞత అనిపించుకోదు. ఒక్కో రాజకీయ పార్టీకి, ఒక్కో రాజకీయ విధానం ఉంటుంది. రాజకీయ అంశంలో గానీ సమస్యల విషయంలోగాని సైద్ధాంతిక అంశా లలో గాని ఏపార్టీ పద్ధతులు వారికి వుంటాయి. ఒక పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో, ఎత్తుగడలు వేస్తుందో, ఇతర పార్టీలు కూడా అదే మాదిరిగా ఆలోచించాలని, మాట్లాడా లని కోరుకోవడం ప్రజా స్వామ్య సూత్రాలకు విరుద్ధం. అదొక విధంగా నియంత పోకడలకు దారి తీస్తుంది. అయితే ఒక పార్టీ అనుసరించే విధానంపై అభ్యంతరాలు, అభి ప్రాయభేదాలు ఉంటే విమర్శ చేయడం ద్వారా ఎత్తి చూపవచ్చు. అంతేకాని ఆ పార్టీ కార్యక్రమాలకు అడ్డుపడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమంజసం కాదు.
తెలంగాణ అంశంలో తప్పెవరిది?: ఇపుడు తెలంగాణ అంశం రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయ సమస్యగానే మారిపోతున్నది. దానికి కారాణాలేంటి? ఈ సమస్య 1956 వ. సంవత్సరం నుండే ప్రారంభమైనది. హమీలతో కూడిన పెద్ద మనుషుల ఒప్పందం కొనసాగింపులో అనేక ఇబ్బందులు ఏర్పడినా ఎప్పటికప్పుడు తాత్కలిక మేనేజ్‌మెంట్‌ ద్వారా అధిగమిస్తూవస్తున్నది. ఇప్పుడు అది పరాకాష్టకు చేరింది.రాష్ట్రంలోను, కేంద్రంలోను కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ ప్రభుత్వాలే వున్నాయి. 2004 లో సూత్రప్రాయంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదించబడిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశం చోటు చేసుకున్నది. 2009లో డిసెంబర్‌ 9న అధికార పూర్వకంగా ప్రకటించబడింది. అయితే ప్రకటించిన విధానం నుండి కేంద్ర అధిష్టానం వెనక్కు పోయింది. అప్పటి నుండి ఎటూ తేల్చకుండా కేంద్రం ఊగిసలాటలో పడింది. చివరికి వారి సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీనే నియంత్రించుకోలేక ఎత్తుగడలలో భాగంగా ఏప్రాంత కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఎవరి అనుమానాలు వారికి వున్నాయి. అలాంటప్పుడు విధాన నిర్ణయం దృఢంగా తీసుకోగలిగే స్థితిలో ఉన్నది కాంగ్రెస్‌ అధిష్టానమే. విధాన నిర్ణయం చేయగలిగిన కాంగ్రెస్‌ అధిష్టానానికి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్‌, వయలార్‌ రవి లాంటి వారు రాష్ట్రానికి వచ్చి వెళ్త్తూనే వున్నారు. మన రాష్ట్రం నుంచి కీలక పాత్రవహించే కేంద్రమంత్రులు పర్యటిస్తూనే వున్నారు. టి.ఆర్‌.ఎస్‌. అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు సైతం కాంగ్రెస్‌ అధిష్టానంతో మంతనాలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే వున్నారు. అయితే ఈ చర్చలను కూడా మేము రాజకీయ ప్రక్రియలో భాగంగానే చూస్తున్నాము. కాని తెలంగాణాకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీతో కె.సి.ఆర్‌. ఎలా చర్చిస్తారని ప్రశ్నిస్తే ఐకాస ఏమి సమాధానం చెప్పగల్గుతుంది. అలాంటప్పుడు తెలంగాణ అంశంపై ప్రతిపక్షాలపై పడాల్సిన అవసరం వున్నదా? తెలంగాణకు వ్యతిరేకం కాదని, గతంలోనే లేఖ ఇచ్చామని టిడిపి చెబుతున్నప్పటికీ ఇంకా ఆ పార్టీ ఊగిసలాటలో వుందనడంలో సందేహం లేదు. అయితే వారి పద్ధతులలో వారు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ అంశంపై టిడిపి విధానాన్ని అంగీకరిస్తారా? సమర్థిస్తారా? అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఫలితంగా వచ్చే లాభ నష్టాలకు ఆ పార్టీనే బాధ్యురాలవుతుంది. ఇక బిజెపి కూడా ఒకప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోయినా ప్రస్తుతం అధికార పూర్వకంగానే తెలంగాణ అంశాన్ని సమర్ధిస్తున్నది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం వారి విధానం స్పష్టంగా ప్రకటించ లేక పోతున్నారు. అయితే కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. సమైక్యత కోరే సిపిఐ(ఎం) సైతం ''మా విధానం మాదే. నిర్ణయించగలిగింది కాంగ్రెస్‌ పార్టీయే కాబట్టి వారి నిర్ణయం వారు చేసుకోవచ్చని'' పదేపదే ప్రకటన చేస్తున్నది. ఇక బంతి కేంద్రంలో యుపిఏ సర్కార్‌, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం కోర్టులో ఉన్నది. తెలంగాణ అంశంపై రాజకీయ సానుకూలత ఏర్పడినప్పటికీ ఏకాభిప్రాయమనే కుంటిసాకులతో అంశాన్ని వెనక్కి నెడుతున్నారు. అదే సమయంలో కనీసం నలభై శాతమైనా రాజకీయ ఏకాభిప్రాయం లేని అణు ఒప్పందంపైన, రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం పైన, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో పెట్టుబడుల ఉపసంహరణపైన ఎలా నిర్ణయం తీసుకున్నారు? ఏకాభిప్రాయం రాని అంశంపై ధృఢమైన వైఖరి తీసుకున్న కేంద్రం తెలంగాణ అంశంపై ''ములక్కాడ అడ్డమొచ్చిందని'' తప్పించుకోవటం కాంగ్రెస్‌కు పరిపాటైంది. తెలంగాణకు అడ్డంకిగా వున్న కాంగ్రెస్‌ పార్టీని, ఆపార్టీ కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులను నిలదీయకుండా, విపక్షంలో ఉన్న టిడిపిపైన, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పైన పడటమనేది రాజకీయ నైతికత కాదు. కాబట్టి పాదయాత్రను అడ్డుకోవడం మంచిది కాదు. పాదయాత్రపై విభేదిస్తూ ప్రకటన చేయొచ్చు. కానీ అడ్డగించడం రాజకీయ సంప్రదాయం కాదు. తెలంగాణ అంశాన్ని తేల్చగల స్థాయిలో ఉంటూ ద్రోహం చేస్తున్నది, తెలంగాణకు ప్రధాన శతృవుగా ఉన్నది కాంగ్రెస్‌ పార్టీయే. కాబట్టి అన్ని బాణాలు ఎక్కుపెట్టాల్సింది కాంగ్రెస్‌ వైపే.
No comments :

No comments :