October 17, 2012

ఉద్యోగులకు మేం వ్యతిరేకం కాదు.. (17వ రోజు)

ఉద్యోగులకు మేం వ్యతిరేకం కాదు
ఇళ్లు లేని రిటైర్డ్ ఉద్యోగులకు స్థలాలు
ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేక విధానం

రైతు రుణమాఫీపై తొలి సంతకం
రెండోది బెల్టుషాపుల రద్దుపైనే
ఆశీర్వదించండి.. అన్నగా అండగా ఉంటా
అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు చేపడతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. రిటైరైన ఉద్యోగులలో.. ఇళ్లు లేనివారికి స్థలాలు మం జూరుచేసి, వారికి రాయితీతో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వాళ్లు ఆనందంగా ఉండటానికి కావల్సిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసలు ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని.. కొందరు వ్యక్తులు అలాంటి భావనను ఉద్యోగుల్లో ప్రేరేపించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

తమ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రతిభావంతులకు పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఉద్యోగ బదిలీలకు ఓ పద్ధతిని ప్రవేశ పెట్టింది కూడా తమ పార్టీయేనని ఆయన చెప్పారు. ఇక.. తమ పాలనలో ఆర్టీసీని పరిరక్షిస్తూ వచ్చామని, కాంగ్రెస్ ఆ సంస్థను దివాలా తీయించిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల కు ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తామన్నారు.

నేతన్నల కోసం జనతా వస్త్రాలు
రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం జనతా వస్త్రాలను ప్రవేశపెడతామని చంద్రబాబు హామీనిచ్చారు. వారికిచ్చిన రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ. 1.2 లక్షలతో చేనేత కార్మికులకు షెడ్డుతో కూడిన ఇళ్లు నిర్మిస్తామన్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకాన్ని రైతు రుణమాఫీ ఫైలుపై పెడతానని, రెండో సంతకం బెల్టుషాపుల రద్దు ఫైలుపై పెడతానని స్పష్టం చేశారు.

చైతన్యం రావాలి.. మోసగాళ్లను తరమాలి
"మీరు కష్టాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసింది. మీరు బాధల్లో ఉంటే నేను హైదరాబాద్‌లో ఉండలేను. అందుకే మీ వద్దకు వచ్చాను. రైతులు, మహిళలు చేతివృత్తుల వారు.. ఇలా అన్ని వర్గాల ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో మీరు నన్ను అర్థం చేసుకోండి. మీరు నిండుమనసుతో ఆశీర్వదిస్తే మీ అన్నగా మీకు అండగా ఉంటాను'' అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు.

'వస్తున్నా.. మీ కోసం' అంటూ ఆయన చేపట్టిన పాదయాత్ర 16వ రోజు కర్నూలు జిల్లా ఆదోనికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని శ్రీనివాసభవన్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం రావాలని, మోసగాళ్లను అధికారం నుంచి తరమాలని ఆయన పిలుపునిచ్చారు. సభకు పోటెత్తిన జనాన్ని చూసి ఉద్వేగభరితులయ్యారు. పాదయాత్రలో తాను గమనించిన ప్రజల కష్టాలను వివరిస్తూ అడుగడుగునా ప్రజలకు ధైర్యం నూరిపోశారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కేరాఫ్ కుంభకోణం అయిందని ఆయన విమర్శించారు. వైఎస్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరణిస్తే.. ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఏకంగా సీఎం కుర్చీకి పోటీ పడటం విడ్డూరమన్నారు. ఏళ్ల తరబడి మోసం చేస్తూ రాష్ట్ర ఖజానాను గుల్లచేసిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలని.. ప్రశ్నించే తత్వం పెరగాలని చంద్రబాబు కోరారు. అలాంటప్పుడే ఈ రాజకీయ పరిస్థితులను మార్చగలమన్నారు. బుధవారం ఉదయం ఢణాపురం నుంచి ప్రారంభమైన చంద్రబాబు యాత్ర మంగళవారం కంటే మరింత ఉత్సాహంగా సాగింది.

రైతులకు రుణమాఫీపై హామీనిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడానికి ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో కొందరు రైతులు చంద్రబాబును కలిసి నాగలిని బహూకరించారు. అనంతరం ముందుకు సాగిన బాబు పొలాల్లో పంట కోస్తున్న రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. రజకుల వద్దకు వెళ్లి బట్టలు ఇస్త్రీ చేశారు. టైలర్లను పలకరించారు. కమ్మారెడ్డి బస్టాండ్ వద్ద అంగన్‌వాడీల గోడు విన్నారు. శ్రీనివాసభవన్ సర్కిల్ వద్ద దర్గాకు వెళ్లి ప్రార్థనలు జరిపారు.

కష్టమైనా.. నష్టమైనా పూర్తిచేస్తా
టెలికాన్ఫరెన్స్‌లో నేతలతో చంద్రబాబు

నా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు. చిన్న చిన్న అనారోగ్యా లు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి నాకుంది. అనుకున్న ప్రకారమే పాదయాత్ర పూర్తిచేస్తాను. సందేహం అవసరం లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా సరే... వెనుదిరిగేది లేదు' అని టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలకు స్ప ష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో తన ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చిన నేతలతో ఆయన ఇలా పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, రాష్ట్ర కమిటీ నేతలతో చంద్రబాబు బుధవారం కర్నూలు జిల్లా ఢణాపురం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన పాదయాత్ర జరుగుతున్న తీరును.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఆయన ఈ సందర్భంగా నేతలకు వివరించారు. ఈనెల 20న మొదలుకానున్న 'గడపగడపకూ తెలుగుదేశం పార్టీ' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
No comments :

No comments :