October 17, 2012

" రైతులు రుణ మాఫీ" పాదయాత్రలో చంద్రబాబు 15వ రోజు

ధర్మ యుద్ధం
మాఫీపై తొలి సంతకం
బెల్టుషాపుల రద్దుపై మలి సంతకం
అధికారంపై ఆశ లేదు
మీ కష్టాలు చూడలేకే పాదయాత్ర
పంట నష్టపరిహారం రూ.10 వేలకు పెంచుతా
ఉపాధి కూలీలకు రోజుకు రూ.200

"తెలుగుదేశం అధికారంలోకి వస్తే, మొదటి సంతకం రైతులు రుణ మాఫీపైనే. రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపై చేస్తాం'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. "ఒకే కుటుంబం నుంచి ఎన్టీ రామారావు, నేను అనేక ఏళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగాం. ఏనాడైనా మేం పేపర్ కానీ, టీవీ చానల్ కానీ పెట్టామా? ప్రజల డబ్బును కాపాడాలనే మేం చూశాం. కానీ, వైఎస్ ముఖ్యమంత్రి కాగానే ఆయన కుమారుడు ప్రజల డబ్బుతో పేపర్, చానల్ పెట్టారు. అందుకే ఇది నీతికీ-అవినీతికీ.. ధర్మానికీ-అధర్మానికీ మధ్య జరుగుతున్న పోరాటం'' అని పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మంగళవారం ఆయన తన 15వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడి వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్రంలో మాదిగలు, ఉప కులాలకు పూర్వ వైభవాన్ని తెస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా పొలాల్లోకి వెళ్లి రైతులు, రైతు కూలీలతో ముచ్చటించారు. దుక్కి దున్నారు. పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. టైలరింగ్ షాపులోకి వెళ్లి దుస్తులు కుట్టారు. కాసేపు ఎడ్లబండి తోలారు.

మంగళవారం 17.5 కిలోమీటర్లు నడిచారు. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, "ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలో చక్రం తిప్పినవాడిని. ఆనాడు ప్రధానమంత్రి పదవికి, రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపికలోనూ చక్రం తిప్పినవాడిని. అసలు నన్నే ప్రధానిగా ఉండమని పలువురు కోరారు. అయినా సీఎం పదవి చాలన్నాను. మళ్లీ నాకు అధికారం మీద ఆశ లేదు. కానీ, ప్రస్తుతం మీరు పడుతున్న కష్టాలను చూడలేక మీకు ఏదైనా చేయాలన్న తపనతో.. మీ ముందుకు వచ్చానే తప్ప మరొకటి కాదు'' అని స్పష్టంచేశారు.

కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తోందన్నారు. "తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.2500 పరిహారాన్ని రూ.10 వేలకు పెంచుతా. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఉపాధి కూలీగా రూ.200 అందేలా చేస్తాం. అటు కూలీలు ఇటు రైతులు బాగుపడేలా చేస్తాం'' అని హామీలు గుప్పించారు.

తాము అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత కరెంట్‌ను నిరంతరాయంగా ఇస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అగ్రవర్ణ పేదలకు ఉచిత విద్య అందించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. పంటలు లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగి రైతులు కష్టాల్లో కూరుకు పోయారని, వారి కళ్లల్లో వెలుగు చూసే దాకా విశ్రమించనని చెప్పారు.

తాజాగా మైనారిటీ కార్పొరేషన్‌లో రూ.150 కోట్ల అవినీతి బయట పడటం ప్రభుత్వ దుస్థితికి అద్దం పడుతోందన్నారు. కర్నూలు జిల్లాలో ఎవరిని పలకరించినా కన్నీళ్లు రాలాయే తప్ప వారి ముఖాల్లో సంతోషం కనిపించడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు చూస్తుంటే రాత్రుళ్లు నిద్ర రావడం లేదన్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్
ఆదోని, అక్టోబర్ 16: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ధనాపురం నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడినుంచి పాదయాత్రగా.. కల్లుబావి ప్రాంతం చేరుకొని చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఫ్లై ఓవర్ మీదుగా శ్రీనివాసభవన్ కూడలికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.

అక్కణ్నుంచి ఎం.ఎం. రోడ్డు మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఎమ్మిగనూరు సర్కిల్, బండిమెట్ట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. బైచిగేరి గ్రామం క్రాస్ చేరుకొని ఆరేకల్లు సభలో ప్రసంగిస్తారు. గురుకుల పాఠశాలలో రాత్రి బస చేస్తారు.

300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
హైదరాబాద్: చంద్రబాబు పాదయాత్ర మంగళవారం నాటికి 300 కిలోమీటర్లు పూర్తయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనపురంలో ఆయన పాదయాత్రను 301.2 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు.
No comments :

No comments :