October 19, 2012

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదనట్లు వైఎస్ షర్మిల పాదయాత్ర ----శోభా హైమవతి

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే అర్హత వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిలకు లేదని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమవతి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగా పొయ్యి కింద మంటలేదు.. పొయ్యిమీద వంట లేదు అనే విధంగా తయారైందని వారు విమర్శించారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బాబు ఇంతకు ముందు రెండుసార్లు కేంద్రానికి లేఖలు అందజేశారన్నారు. ఐనా కొంత మంది కావాలని మళ్లీ అభిప్రాయం చెప్పాలని ఒత్తిడి తేవడం అర్థ రహితమన్నారు.

మహబూబ్‌నగర్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే చంద్రబాబు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర చేపట్టారన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదనట్లు వైఎస్ షర్మిల చంద్రబాబుకు పోటీగా పాదయాత్రను చేపట్టారని విమర్శించారు. పాదయాత్రలో ప్రజలకు ఏమి చెబుతారని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో లక్షలెకరాల ప్రజల భూమిని అక్రమంగా తమ వాళ్లకు కట్ట బెట్టారని విమర్శించారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కొంత మంది కావాలని పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

అయినప్పటికీ ప్రజలు చంద్రబాబు పాదయాత్రను స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాలినొప్పులను ఖాతరు చేయకుండా చంద్రబాబు పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న జేఏసీ నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి పర్యటనను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మద్యపానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నిషేధించేందుకు బదులుగా ఇష్టమొచ్చినట్లు బెల్టు షాపులకు అనుమతిచ్చి పేద ప్రజల జేబులకు చిల్లులు కొట్టి ఆదాయాన్ని పెంచుకున్నారని విమర్శించారు.

గ్యాస్ సిలిండర్లపై సీలింగ్ విధించి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అస్తవ్యస్త పాలన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విలేఖరుల సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షురాలు రాధిక, ప్రధాన కార్యదర్శి వనజ, ఉపాధ్యక్షురాలు సరోజ, అధికార ప్రతినిధి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి పాల్గొన్నారు.



chandrababu naidu padayatra vastunna meekosam at kurnool dist 19.10.2012