September 20, 2013

జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుంది



అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి త్వరగా బెయిల్‌పై బయటకు రావడం కోసమే హడావుడిగా సీబీఐ చార్జీషీట్లను దాఖలు చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో గతంలో సిబిఐ అదనపు సంచాలకులుగా పని చేసిన లక్ష్మీ నారాయణ ఏడాదిన్నరకు పైగా విచారణ జరిపి ఐదు ఛార్జీషీట్లు వేస్తే, తర్వాత వచ్చిన అధికారులు మాత్రం వారం రోజుల్లోనే ఐదు ఛార్జీషీట్స్ వేశారని అన్నారు. జగన్ బెయిల్ కోసమే తాజాగా హడావుడిగా ఐదు ఛార్జీషీట్లు వేశారని ఆరోపించారు.

గతంలో ఐదు ఛార్జీషీట్లు వేసేందుకు అన్ని రోజులు తీసుకుంటే తాజా ఐదు ఛార్జీషీట్లను వారం రోజుల్లోనే ఎలా వేశారని యనమల ప్రశ్నించారు. జగన్ ఓ విషపు చేప అని ఆయన బయటకు వస్తే చాలా ప్రమాదమన్నారు. జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుందన్నారు. అలాగే అతను జైలు నుండి బయటకు వస్తే సమాజాన్ని అవినీతి విషంతో నింపి వ్యవస్థలను అంతం చేస్తాడని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.