August 10, 2013

తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణకు రాష్ట్రం నలుమూలలా చంద్ర బాబు బస్సు యాత్ర

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో యాత్రకు సిద్ధపడుతున్నారు. ఆయన ఈసారి బస్సు యాత్ర చేబడుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర అని ఈ యాత్రకు నామకరణం చేయనున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అంతిమ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమాల నేపథ్యంలో ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో ప్రజలలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. చంద్రబాబు నాయుడు రాష్ట్రం నలుమూలలా పర్యటించాలని ఆకాంఘిస్తున్నట్టు తెలుస్తున్నది.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలోని పరిస్థితి చిందరవందరగా మారిపోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పెత్తనంతో తెలుగు జాతి అవమానాలను ఎదుర్కొంటున్నదని, గతంలోనూ, ఇప్పుడూ ఇదే పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ నిర్ణయం వల్ల ఇటు తెలంగాణాలోనూ, అటు రాయలసీమ, కోస్తా ఆంద్ర ప్రాంతంలోనూ ఏం జరగబోతున్నదీ, ఈ నిర్ణయం వల్ల రెండు ప్రాంతాలలోనూ సంభవించబోయే నష్టాలను చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించబోతున్నారు.

చంద్రబాబు ఏ జిల్లాలో పర్యటనలో ఉంటే ఆ జిల్లాకు చెందిన దేశం నాయకులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆయన ఇటీవల నిర్వహించిన పాదయాత్ర మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన బస్సు యాత్ర ద్వారా ఎక్కువ ప్రాంతంలో పర్యటించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకారం రాష్ట్రాన్ని విభజించమంటే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో రావణ కాష్టాన్ని సృష్టించిందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం వెలువడడంతో నేరుగా ప్రజలలోకి వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది కాబట్టి బస్సు యాత్ర లో కొన్ని చోట్ల కొన్ని గట్టి ప్రశ్నలు రావచ్చునని, అయినా దీని గురించి ఎక్కువగా దృష్టి పెట్టకుండా ప్రజల ఆకాంక్షల గురించే ఎక్కువ మాట్లాడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడానికి ముందు ప్రజలతో మాట్లాడి, వారిని కూడా భాగస్వాములను చేసి ఒక విధానాన్ని నిర్మాణాత్మకంగా ప్రకటించవలసి ఉందని చంద్రబాబు నాయుడు అబిప్రాయపడ్డారు. విభజనకు ఒక పద్ధతి ఉంటుందని, ఆ పద్ధతులు పాటించకుండా అంతా హడావుడిగా చేసేశారని ఆయన తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్‌తోనూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించాలనుకుంటున్నారు. వెంటనే రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.