August 28, 2013

టీడీపీని దెబ్బతీసేందుకే!

తెలంగాణకు మద్దతుగా చంద్ర బాబు ఇచ్చిన లేఖ ఓ గడ్డిపరకతో సమానమని, ఆరుగురు ఎంపీలు కూడా లేని ఒక పార్టీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం విలువ ఇవ్వలేదని తెలుగు దేశం సీనియర్‌ నాయకులు కోడెల శివ ప్రసాద్‌, వర్లరామయ్య పేర్కొ న్నారు. సమైక్యాంధ్ర కోసం విజయమ్మ దీక్ష పేరుతో దొంగనాటకాలు ఆడారని, రాత్రి 9 గంటల వరకూ శిబిరంలోనూ, ఆ తర్వాత ఏసీ బస్సులోనూ దీక్ష చేశారని వారు విమర్శించారు. అటు తెలంగాణ లోనూ, ఇటు ఆంధ్రలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే సోనియా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఒంగోలు వచ్చిన సీనియర్‌ నాయకులు కోడెల శివ ప్రసాదరావు, వర్లరామయ్య, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు కరణం బలరాంతో సహా జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీతో సంబంధం లేకుండా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఎగిసి పడిందన్నారు. విభజన పాపం ఖచ్చితంగా దివంగత వైఎస్‌ రాజశేఖ రరెడ్డిదేనన్నారు. తాను అధికారంలో లేని సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారని, ఇపుడు కేంద్రం కూడా నాడు రాజశేఖరరెడ్డితో ప్రారంభించి, ఇపుడు సోనియాగాంధీ ముగించిందని పేర్కొన్నారని గుర్తు చేశారు. వారి నాయకుడు పాపాన్ని తమకు అం టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిం చారు. ఇక జైలులో దీక్ష చేస్తున్న జగన్‌ ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరోగ్యం బాగో లక అన్నం తినకుండా ఉన్నారేమో ఎవరికి తెలుసంటూ వారు విమర్శించారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న జగన్‌, ముందు రాష్ట్రం నుండి తాను దోచుకున్న సొమ్మెంతో చెప్పాలని వారు విమర్శించారు.

సొసైటీ ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో తెలుగుదేశం మంచి ఫలితాలు సాధించడంతో కక్ష కట్టిన సోనియా గాంధీ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విభజన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా ఈ విభజన నిర్ణయం లేదన్నారు. ఇరు ప్రాంతాలకు సమానన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే మేం డిమాండ్‌ చేస్తాం అన్నారు.