July 10, 2013

రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయండి

ఐఐటి, ఎన్‌ఐటి జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు, జెఇఇలో ఎక్కువ మార్కులు వచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బాగా నష్టపోయారన్నారు. జెఇఇలో తక్కువ మార్కులు వచ్చి, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన ఇతర రాష్ట్రాల వారికి ప్రయోజనం కలిగిందన్నారు. టాప్ 20 నార్మలైజ్డ్ పర్సెంటైల్ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారన్నారు.

మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతలను తొలగించడం, ప్లస్‌టూ స్ధాయిలో వివిధ విద్యా బోర్డుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి ఏకీకృత విధానం ద్వారా విద్యార్ధులకు న్యాయం చేయాలనే విధానం దెబ్బతిందన్నారు. గతంలో జెఇఇలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఐఐటి, నిట్‌లలో అడ్మిషన్లు ఇచ్చేవారన్నారు. పర్సంటైల్ విధానం వల్ల ఐఐటిలో వెయ్యి సీట్లు, ఎన్‌ఐటిలో 1500 సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పాతరన్నారు. కాని ఈ సారి ప్లస్ టూ స్థాయిలో మార్కులను పరిగణనలోకి తీసుకోవడం, ఇది లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నష్టపోయారన్నారు.

ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజ్ ఇవ్వాలనే నిర్ణయం వల్ల వివక్షతకు దారితీసినట్లయిందన్నారు. అలాగే కటాఫ్ మార్కులు 20 పర్సంటైల్ విధించడం వల్ల త్రిపురలో 53 శాతం వచ్చిన ప్లస్ టూ విద్యార్థికి సీటు వస్తే, ఆంధ్రాలో 91.89 శాతం వచ్చిన విద్యార్థికి సీటు రాని పరిస్థితి తలెత్తిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ఐఐటి జెఇఇలో ఎక్కువ మార్కులు వచ్చినా టాప్ 20 పర్సంటైల్ విధానం వల్ల సీట్లుపొందలేకపోతున్నారన్నారు. పర్సంటైల్ విధానం వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న అంశంపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. లేని పక్షంలో విద్యార్ధుల అమూల్యమైన జీవితం నాశనమవుతుందన్నారు.

అఖిల భారత ప్రవేశపరీక్షల్లో కూడా రాత పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారన్నారు. 2009-10లో మన రాష్ట్రానికి చెందిన 1697 మందికి సీట్లు వచ్చాయన్నారు. 2012-13లో 2500 సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరిగినా కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల అన్ని వ్యవస్ధలతో పాటు విద్యారంగం కూడా భ్రష్టుపట్టిందన్నారు. కేంద్రం కూడా రాష్ట్ర విద్యార్థుల పట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. మన విద్యార్థుల ప్రతిభకు కేంద్రం అడ్డుపడుతోందన్నారు. ఈ అంశంపై దృష్టిసారించి, రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న చంద్రబాబు