July 26, 2013

భవిష్యత్తు తెలుగుదేశానిదేనా !

పంచాయితీ ఎన్నికల తొలిదశ ఎన్నికల ఫలితాలను పరికిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సైలెంట్ వేవ్ నడుస్తోందా అన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రత్యర్ధి పార్టీల వారినే కాకుండా సాక్షాత్తూ ‘దేశం’ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను సైతం ఈ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయనటం అతిశయోక్తి కాదు. పల్లెల్లోని ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేయరు అనే అభిప్రాయానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలోని అత్యధిక పంచాయితీలు తెలుగుదేశం బలపరచిన అభ్యర్ధులనే సర్పంచ్ లుగా ఎన్నుకోవటం చూస్తుంటే గ్రామీణ ఓటర్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. మూడు విడతల ఎకగ్రీవాలను కలుపుకుంటే తొలిదశలో అధికార కాంగ్రెస్ పార్టి తెలుగుదేశం కంటే కేవలం 4 స్థానాలను మాత్రమే అధికంగా గెలుచుకుంది. రాష్ట్రంలోని పది జిల్లాలలో తెలుగుదేశం జయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ కేవలం 6 జిల్లాలకే పరిమితమయింది. కాగా అందరినీ దిగ్భ్రాంతి కి గురిచేస్తూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు జిల్లాలకే తనను తాను పరిమితం చేసుకుంది.

మూడు విడతల ఏకగ్రీవాలను కలిపితే కాంగ్రెస్ పార్టీ 2,311 పంచాయితీలను, తెలుగుదేశం పార్టీ 2,307 పంచాయితీలను, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,599 పంచాయితీలను గెలుచుకున్నాయి. కాగా విచిత్రం ఏమిటంటే స్వీప్ చేస్తుందనుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి కేవలం 532 పంచాయితీలను మాత్రమే గెలుచుకుని తెలంగాణా లో రెండు జిల్లాల్లో తన ప్రభావాన్ని చాటుకుంది, ఈ ఫలితాలను నిశితంగా పరిశిలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అతి తక్కువ కాలంలో పునర్ వైభవాన్ని పొందేందుకు మార్గం సుగమం చేసుకుందన్నది అర్ధమవుతుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ కి గ్రామీణ వోటర్లు లేరు. అయితే అన్ని అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ తొలిదశ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కు పల్లెల్లో అనూహ్యంగా పెరిగిన ఆదరణకు నిలువెత్తు దర్పణంలా నిలిచాయి. ఈ సారి పల్లెలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే నిలుస్తాయి అన్న అంచనాలను సైతం ఈ ఎన్నికలు పటాపంచలు చేసాయి. ఆ పార్టీ మూడవ స్థానంలో మిగిలిపోయింది.

ఇంత ఆకస్మికంగా పల్లెల్లో తెలుగుదేశం పార్టీ కి ఇంతటి గ్రామీణ జనాదరణ పెరగటానికి కారణాలను అన్వేషించేందుకు రాజకీయ పరిశీలకులు కుస్తీలు పడుతున్నారు. ఏడు నెలలపాటు అలుపెరగకుండా చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రభావం పల్లె ప్రజల మీద ఎక్కువగా ఉందన్నది రాజకీయ పండితుల భావన. అలాగే ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవటం లో ప్రభుత్వంకంటే వేగంగా చంద్రబాబు స్పందించి బాధితులకు సహాయం అందించిన తీరు కూడా ప్రజల మనస్సుల్లో బలంగా నాతుకుందని విశ్లేషకుల భావనగా తెలుస్తోంది. రెండవ దశ, మూడవ దశ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతే బలంగా వుంటే రానున్న ఎంపిటిసి లు, జెడ్ పి టి సి లు, మునిసిపాలిటీ లలో సైతం సానుకూలంగా వుంటాయనటం లో సందేహం లేదు. ఏది ఏమైనా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలతో బాటు తెలంగాణా లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా వుండటం ప్రత్యర్ధి పార్టీలను గందరగోళానికి
గురి చేస్తోంది.