July 26, 2013

దేశం గుంభనం టి అంశంపై బాబు ఆదేశం

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై నోరుమెదపవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణుల్ని ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకంలో టిడిపి పాత్రధారి కాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణాపై నిర్ణయం అంటూ ఢిల్లీలో కాంగ్రెస్‌ చేస్తున్న హడావిడిని పట్టించుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని సాధారణ ఎన్నికలకు సమాయత్తం చేయడంపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి తద్వారా టిడిపిని ఇరకాటంలో పెట్టాలనే కాంగ్రెస్‌ కుటిల వ్యూహాన్ని చంద్రబాబు ఇప్పటికే అన్ని వేదికలపైనా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలపై నుంచి టిడిపి దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్‌ ఈ తరహా హడావిడి చేస్తుందనే విషయాన్ని గమనించిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని, జరుగుతున్న పరిణామాల్ని గమనించాలే తప్ప మీడియాకు ఎక్కవద్దని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణా అంశంపై మహానాడులో తీర్మానం చేసినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో సీమాంధ్రలో కూడా మెరుగైన ఫలితాలు రావడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని ప్రాంతాల ప్రజలు టిడిపి మనోభీష్టాన్ని అర్ధం చేసుకున్నారని తొలివిడత ఎన్నికలు ముగియగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ హవా తగ్గడం, టిడిపి పుంజుకున్నప్పటికీ కాంగ్రెస్‌ కూడా భారీగానే లబ్దిపొందడాన్ని టిడిపి నేతలు రాజకీయకోణంలోనే విశ్లేషిస్తున్నారు. మరోవైపు సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి టిడిపిపై వత్తిడి పెంచే కుట్రనూ పరికిస్తున్నారు. గతంలో తెలంగాణాలో కూడా ఇదే తరహా రాజకీయం నడిచిన విషయాన్ని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ హడావిడికి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆపార్టీ నిర్ణయం ప్రకటించాక ఏం చేయాలనేదానిపై ఆలోచన చేద్దామనే సంకేతాలు రెండు ప్రాంతాల నేతలకు వెళ్లినట్లు సమాచారం.

తెలంగాణా అంశంపై సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం గుంభనంగానే ఉంటోంది. రెండు ప్రాంతాల నేతలు ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇదే అంశాన్ని పార్టీలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌ నేతను ప్రశ్నిస్తే 'కందకు లేని దురద కత్తిపీటకెందుకు' ముందు కాంగ్రెస్‌ నిర్ణయం తెలియనివ్వండి అని వ్యాఖ్యానించారు. తెలంగాణాపై పేటెంట్‌ హక్కులు ఉన్నట్లు హడావిడి చేసే టిఆర్‌ఎస్‌ కూడా ఈ అంశపై మౌనంగా ఉండటాన్ని టిడిపి నేతలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 'డిఫెన్స్‌'లో పడే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడేందుకు టిడిపి అధినాయకత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తోంది.

2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన సందర్భంగా కాంగ్రెస్‌తో పోటీ పడి టిడిపి కూడా ఆందోళనలు నిర్వహించింది. ఈ విషయంలో ఆనాడూ ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి భిన్నమైన వైఖరిని పార్టీ తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుంటే మానవ బాంబులమవుతామంటూ గతంలో కృష్ణా, అనంతపురం జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యేలు సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వారు కూడా మౌనంగా ఉంటున్నారు. వస్తున్నా మీ కోసం చంద్రబాబు పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, అలాంటి పరిస్థితుల్లో విభజన, సమైక్య ఆందోళనలు చేయడం వల్ల నష్టంతోపాటు ఐక్యత కూడా చెడుతుందని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. అయితే సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి హడావిడిని కట్టడి చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, క్షేత్రస్థాయిలో ఏదోఒక ఆందోళనలు చేపట్టడమే మంచిదనే అభిప్రాయాన్ని మాజీ మంత్రి గోరంట బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. దీనిపై మెజారిటీ పార్టీ నేతలు మాత్రం ఏకీభవించకపోవడం గమనార్హం.