June 11, 2013

బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు

బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు, బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు ఉదయం గన్‌పార్క్‌లో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయకత్వంలో టిడిపి ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి గిరిజనులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో బయ్యారంపై టిఆర్‌ఎస్ ఆందోళన జరుపుతోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత ఈ అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు టిఆర్‌ఎస్ గతంలో ప్రకటించింది. దీంతో బయ్యారం అంశంపై టిడిపి సైతం రంగంలోకి దిగింది. నిజానికి గతంలో టిడిపి అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి బయ్యారంలో ఉక్కు లేదు తుక్కు లేదు, కిరణ్ కుమార్‌రెడ్డి, కెసిఆర్ కలిసి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అయితే అనంతరం టిడిపి తెలంగాణ నాయకులు బయ్యారం సందర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో బయ్యారంపై చర్చకు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఉదయం గన్‌పార్క్‌లో చంద్రబాబు నాయకత్వంలో ధర్నా చేశారు. సభ వాయిదా పడిన తరువాత టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు మాట్లాడుతూ బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అని అన్నారు. బయ్యారం ఉక్కును వైఎస్ తన అల్లుడికి కేటాయిస్తే 2008 నుంచి తామే ఉద్యమిస్తున్నామని తెలిపారు. అయితే బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదం నుంచి గిరిజనుల హక్కు నినాదంగా మారడం గురించి విలేఖరులు ప్రశ్నించగా, మొత్తం తెలంగాణ వారు అక్కడికి వస్తే ఎలా అక్కడి గిరిజనులకు ఉద్యోగాలు లభించాలి కదా అందుకే బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అనే నినాదంతో ఉద్యమిస్తున్నట్టు టిడిపి తెలిపింది.
సొంతంగా ఆలోచించండి
తెలంగాణలో టిఆర్‌ఎస్ ఒక కార్యక్రమాన్ని చేపడితే మీరు దాన్ని అనుసరిస్తున్నారు, అలా కాకుండా మీరూ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టండి అని చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నాయకులకు సూచించారు. మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుతో మరికొందరు హాజరయ్యారు. ఈ నెల 14న చలో అసెంబ్లీకి తెలంగాణ జెఎసి పిలుపు ఇవ్వగా, దీనికి టిడిపిని ఆహ్వానించలేదు, ఏం చేయాలి అని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో చర్చించారు. కార్యక్రమానికి దూరంగా ఉండడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. జెఎసి ఆహ్వానించక పోయినా, మా మద్దతు కోరక పోయినా మేం మద్దతు ఇస్తున్నాం అని బుధవారం ప్రకటించాలని నిర్ణయించారు.
ప్రతి రోజూ ధర్నా
అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద ఏదో ఒక అంశంపై రోజూ ధర్నా జరపాలని టిడిపి నిర్ణయించింది. ఇందులోభాగంగానే మంగళవారం బయ్యారం గనులపై ధర్నా జరిపిన టిడిపి, బుధవారం రైతుల సమస్యలపై ధర్నా జరపనుంది. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం కోసం టిఆర్‌ఎస్ పట్టుపడుతూ ఉండడం వల్ల టిడిపికి ఎలాంటి మైలేజీ లభించడం లేదని, ఇలాంటి పరిస్థితిలో ఇతర సమస్యలపై గన్‌పార్క్ వద్ద ప్రతి రోజు ఆందోళన చేయాలని టిడిపి నిర్ణయించింది.
ఎపిపిఎస్‌సిని ప్రక్షాళన చేయాలి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి)ను ప్రక్షాళన చేయాలని టిడిపి ఎమ్మెల్యేలు పల్లె రఘునాధ రెడ్డి, జైపాల్ యాదవ్, లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఉన్నత విద్యావంతులను సభ్యులుగా నియమించాల్సి ఉండగా, రాజకీయ బ్రోకర్లను నియమించారని విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించాలని కోరుతూ రాష్టప్రతికి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు వినతిపత్రం అందజేస్తామని, రాష్టప్రతి నుంచి సరైన స్పందన లేకపోతే కోర్టుకు వెళ్తామని తెలిపారు.