May 29, 2013

దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే....

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టై ఏడాది పూర్తయినందున దానిని నిరసిస్తూ ఆ పార్టీ చేసిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. బెయిల్ రాలేదని జగన్ పార్టీ నిరసనలు చేపట్టడం సిగ్గు చేటు అన్నారు.

దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలన్నారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు.

బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు విడ్డూరమన్నారు. తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్నారు. వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని, అలా అంటే ఇప్పుడు ఉన్నది చెడ్డకాలం అనేగా అన్నారు. వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు. జైల్లో తాగుడు, బ్లూ ఫిలిమ్స్ చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా బాబు సమక్షంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం టిడిపిలో చేరారు.