May 13, 2013

ప్రకాశం జిల్లాలో పుంజుకుంటున్న టిడిపి

ఒంగోలు, మే 12: జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకేఒక్క స్థానానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ నేడు నాలుగైదు నియోజకవర్గాల్లో బలంగా ఉంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఒక్క మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి తరపున ఒంగోలు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ప్రధానంగా సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం సానుకూల పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటినుంచే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. దర్శి పట్టణంలో శిద్దా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇక సిట్టింగ్ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా తన సొంత నిధులతో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ప్రజాసేవలో ముందున్నారు. అద్దంకి నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమర్, మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్యల మధ్య వార్ కొనసాగుతోంది. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్యనేతలు వైఎస్‌ఆర్‌సిపి పంచన చేరారు. దీంతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది. కనిగిరి నియోజకవర్గంలో కూడా వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే చెప్పవచ్చు. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని సమన్వయకర్తలుగా నియమించకపోవడం, మరొకపక్క పారిశ్రామికవేత్తల వైపు పార్టీ అధిష్ఠానవర్గం చూస్తుండటంతో వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరితే కాంగ్రెస్‌కంటే తెలుగుదేశం పార్టీకే లాభిస్తుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లు ఏమాత్రం చీలలేదు. కాని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను మాత్రం వైఎస్‌ఆర్‌సిపి భారీగా చీల్చిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన ఉన్న కొంతమంది నేతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ క్షణంలోనైనా జెండా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి. మొత్తంమీద జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

couretesy : Andhrabhoomi