February 27, 2013

శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగిస్తా

శ్రీకాకుళం వరకు వస్తున్నా... మీకోసం పాదయాత్రను కొనసాగించి తీరుతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా పార్టీ నాయకులు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు మం డుతున్న ఎండలు, ఆరోగ్యం దృష్ట్యా పాదయాత్రను విరమించాలని కోరా రు. అందుకు చంద్రబాబు సున్నితం గా తిరస్కరిస్తూ తాను ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు కష్టమైనా పాదయాత్ర కొనసాగిస్తున్నానని చెప్పారు. శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగించాలన్న నిర్ణయం తీసుకొన్నానని, ఎన్ని కష్టాలు ఎదురైనా మే ఒకటో తేదీ లోగా గమ్యస్థానానికి చేరుకొంటానని స్పష్టం చేశారు. అనంతరం వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో సమీక్షించారు. ఇటీవల వెలువడిన సహకార ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పని అయిపోయిందని, ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోయాయన్నారు. వైసీపీ నిలబడలేదని, అది తల్లి కాం గ్రెస్‌లో కలసిపోవడం ఖాయమన్నా రు. సమష్ఠిగా పని చేసి పార్టీని పటిష్ఠవంతం చేయాలని ఆదేశించారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో వరంగల్ జిల్లా టీడీపీ నాయకులు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, బసవారెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, ఈగం మల్లేష్, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేసు పెడితే బుద్ధి చెబుతాం

రైతుల కడుపుమంటపై తమ అధినేత చంద్రబాబు మాట్లాడితే కేసులు పెడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రైతులకు నీళ్లివ్వడం చేతకాని కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టడంలో మాత్రం ముందుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.