February 27, 2013

ప్రజల్లో వెనకబడితే సహించను

'ముందస్తు' రావొచ్చు!
తాపీగా కూర్చుంటామంటే కుదరదు
పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

ముందస్తు ఎన్నికలు వచ్చినా రావొచ్చునని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన.. అన్ని జిల్లాల నేతలతోజరిపిన టెలి కాన్ఫరెన్స్‌లోనూ, నల్లగొండ జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షలోనూ 'ముందస్తు' హెచ్చరికలను చేశారు. "ముందస్తు ఎన్నికలు రావచ్చునని అంటున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మీరు ఇలాగే తాపీగా ఉంటానంటే కుదరదు. ఇకనైనా కదలండి'' అని పార్టీ నేతలకు నిర్దేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోడానికి మండల స్థాయిలో పార్టీ యంత్రాంగం సమాయత్తం కావాలని కోరారు. పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు వచ్చేనెల 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో జిల్లా సమన్వయ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనసాగింపుగా మార్చి 4, 5,6, 7 తేదీల్లో అన్ని మండలాల్లో విస్తృత సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ చార్జీల పెంపుదల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలలో జాప్యం వంటి అంశాలపై పార్టీపరంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలని ఉత్సాహపరిచారు.

"మనం కదలాల్సిన సమయం వచ్చింది. ఇంకా సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. మీరు ప్రజలకు దూరంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. వెనకబడిపోయిన వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తుంది' అని హెచ్చరించారు. అంతకుముందు.. సహకార సంఘాల ఎన్నికల ఫలితాలపై నల్లగొండ జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సహకార ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.