February 27, 2013

అలుపెరుగని పాదచారి

జిల్లా రాజకీయ చరిత్రలో ఇదో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ రోజు. రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజమైన నాయకుడు 22 రోజుల పాటు అలుపెరగకుండా ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు జరిగిన సుదీర్ఘ పాదయాత్ర ముగియనున్న రోజు ఇది. ఇంతకుముందెన్నడూ మరే నాయకుడు నడకతోనే ఇన్ని రోజులు 201 కిలోమీటర్లకు పైగా దూరాన్ని జిల్లాలో చుట్టేసిన దాఖలాలు లేవు. మరుపురాని ఘట్టం ముగింపు గడియలకు చేరుకొన్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకం ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు సంసిద్ధమైంది. నేడు జిల్లాలోని రేపల్లె వద్ద పెనుమూడి వారధి మీదగా కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టనున్న ఆ అలుపెరగని పాదచారే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.

చంద్రబాబు కొనసాగిస్తోన్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర జిల్లా ప్రస్థానం బుధవారంతో ముగియనుంది.

ఈ నెల ఆరో తేదీన ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీతానగరం వద్ద జిల్లాలో అడుగుపెట్టిన ఆయన మండుటెండల్లో పాదయాత్ర కొనసాగించారు. తొలి రోజున ఏకబికిన విజయవాడ బస్టాండ్ సెంటర్ నుంచి చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల వరకు ఇంచుమించు 16.5 కిలోమీటర్లు నడిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ రోజున అర్ధరాత్రి ఒంటి గంట వరకు పాదయాత్ర కొనసాగింది. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రాత్రి 10 గంటల సమయానికి పాదయాత్ర ముగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో చంద్రబాబు వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ వచ్చారు. పాదయాత్రలో ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్లి వారిని 'ఏవమ్మా... బాగున్నారా... తమ్ముళ్లు మీరు హుషారుగా ఉన్నారంటూ' అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొన్నారు.

జిల్లాలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సాగునీరు, ఎరువుల అధిక ధరలు, పత్తి, మిర్చి, మినుముకు గిట్టుబాటు లేకపోవడం తదితర సమస్యలను ఆయన అధ్యయనం చేశారు. అలానే కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించారు. డ్వాక్రా మహిళలకు పావలావడ్డీ అందకపోతుండటం, వంటగ్యాస్, బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసర సరుకుల ధరలతో వేగలేకపోతుండటాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యుత్ సర్‌చార్జీల భారాన్ని మోయలేకపోతుండటాన్ని గమనించిన ఆయన ప్రజలను పూర్తిస్థాయిలో చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అర్థమయ్యేలా పొడుపుకథలు చెప్పి జగన్, వైఎస్, కాంగ్రెస్ నాయకులు దోపిడీలను ఎండగట్టారు.

మంగళగిరి, గుంటూరు పశ్చిమ, పెదకాకాని, తెనాలి, వేమూరు, కొల్లూరు, రేపల్లెలో చంద్రబాబు వెంట వేల సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో నడవడం విశేషం. ఎనిమిది నియోజకవర్గాలు, ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలు, 126కు పైగా గ్రామాల్లో పాదయాత్ర సుదీర్ఘంగా జరిగింది. చంద్రబాబు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత యాత్రలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. వైద్యుల సూచన మేరకు ప్రతి ఆదివారం సెలవు తీసుకోవాలని నిర్ణయించి తొలి వారం దానిని పాటించారు. అయితే మరుసటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా 48 గంటల పాటు విశ్రాంతికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఆయన గడిచిన రెండు ఆదివారాలు విశ్రాంతి తీసుకోలేదు. హైదరాబాద్ బాంబుపేలుళ్ల సంఘటనతో చలించిపోయిన ఆయన దిల్‌షుక్‌నగర్ వెళ్లి పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించి వచ్చి మళ్లీ అదేరోజున పాదయాత్రను కొనసాగించారు.

కొలకలూరులో చంద్రబాబు ప్రసంగిస్తున్న స్టేజ్ మెట్లు కూలిన సంఘటనలో ఆయన కుడికాలి మడమ ఒత్తిడికి గురికాగా కేవలం 15 గంటల విశ్రాంతి మాత్రమే తీసుకొని మరలా రోడ్డెక్కి ప్రజల వద్దకు వచ్చారు. వైద్యులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రను ముగించాలని చెప్పినా ఆయన ఆలకించలేదు. 'తాను చేస్తున్నది పవిత్రమైన పాదయాత్ర అని' చెబుతూ తాను శ్రీకాకుళం వరకు నడవాలని నిర్ణయం తీసుకొన్నానని, గమ్యం చేరేవరకు విరమించబోనని మొండిగా ముందుకెళుతున్నారు. చంద్రబాబు ప్రతి రోజు ఉదయం 11 గంటలకు పాదయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత భోజన విరామానికి ఆగి ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలు కాగానే రోడ్డు మీదకు వచ్చేసి ఆ రోజున ఎక్కడైతే శిబిరం ఏర్పాటు చేస్తారో ఎంత సమయమైనా అక్కడి వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 22 రోజుల పాదయాత్రలో ఆయన ఏరోజూ రాత్రి 12 గంటల సమయం దాటనిదే శిబిరానికి చేరుకోలేదు.

టీడీపీ జిల్లా శ్రేణుల్లో సమరోత్సాహం

చంద్రబాబు జిల్లాలో అడుగు పెట్టకముందు పార్టీ శ్రేణులు స్తబ్ధతగా ఉన్నాయి. అధినేత రాక తో నాయకులంతా ఒక్కటయ్యారు. కార్యకర్తల్లో చైతన్యం నింపారు. జనస్పందన అనూహ్యంగా ఉందని, కీపిటప్ అంటూ నేతలను అధినేత భుజంతట్టి ప్రోత్సహించారు. నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం ఉదయం సమావేశమై పార్టీ పటిష్ఠతకు చేపట్టాల్సి చర్యలపై ప్రసంగిస్తారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు శ్రావణ్‌కుమార్, కే వీరయ్య, రాజనారాయణ, సత్యప్రసాద్, జియావుద్దీన్, యాగంటి దుర్గారావు, గోవర్ధన్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, కోవెలమూడి రవీంద్ర, వైవీ ఆంజనేయులు, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, వజీర్, మానుకొండ శివప్రసాద్, సుకవాసి శ్రీనివాసరావు, ములకా సత్యవాణి, పానకాల వెంకటమహాలక్ష్మి, రాణి తదితరులు పాదయాత్రలో ముందుండి ప్రజలను చైతన్యవంతులను చేశారు.