February 26, 2013

నూలు తాళ్లే ఉరితాళ్లవుతున్నాయి!

పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. కులవృత్తులు కునారిల్లుతున్నాయి. నూలుతాళ్లు నేతన్నల పాలిట ఉరితాళ్లవుతున్నాయి. గీత కార్మికుల కష్టాలు ఆ తాడిచెట్టంత ఎత్తున తిష్టవేసి ఏడిపిస్తున్నాయి. మంగళగిరిలో చేనేతల నుంచి రేపల్లెలో కల్లు గీత కార్మికుల దాకా, గుంటూరు పట్టణంలో వస్త్ర వ్యాపారుల నుంచి తెనాలిలో ముస్లిం యువకుల దాకా.. అందరూ ఏదోరకంగా ఈ చేతగాని సర్కారుకు బాధితులేననిపించింది.

గుంటూరు జిల్లా ఆ కొస నుంచి ఈ కొసకు రావడానికి ఇరవై రోజులుపైనే పట్టింది. ఈ మధ్యకాలంలో కలిసిన ఏ సామాజికవర్గంగానీ, ఏ చేతివృత్తిదారుగానీ ఏకరువు పెట్టిన సమస్యల సారాంశం ఒక్కటే. ప్రభుత్వం పనిచేయడం లేదనే కసిని, కన్నీటిని వాళ్లలో ఏకకాలంలో చూశాను. అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలున్నా కేవలం రాజకీయ కారణాలతో కావాలని దూరం పెడుతున్న ఊళ్లనెన్నింటినో ఊరడించాను. ఇందిరమ్మ ఇళ్ల నుంచి రక్షిత జల పథకాలదాకా, ఏదీ అందని గ్రామాలెన్నింటినో పలకరించాను.సమస్త వర్గాల, జనుల బాధలకు ఈ జిల్లాయే ఖిల్లా!

వనరులున్నాయి. వాటిని ఉత్పత్తులుగా మలచగల మందిబలం ఉంది. ఇక్కడ లేనిదల్లా మంచి సంకల్పం కొరవడిన పాలకులే! జిల్లాలో వెయ్యికి పైగా జౌళి మిల్లులున్నాయి. అందులో 80 శాతం మూతబడ్డాయి. పెట్టుబడి లేకనో, శ్రమశక్తులు లేవనో కాదు..సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో ఊపిరి ఆగింది. ఒక పరిశ్రమ పోతే.. ఎన్ని చేతులు ఖాళీ అవుతాయో, ఎన్ని కడుపులు మాడతాయో, ఎంతమంది కుటుంబాలకు దూరమై వలసబాట పడతారో..ఎంత చెప్పినా ఎందుకు అర్ధం కాదో! పల్లెలను ముంచితే ఆ పాపం పది జన్మలెత్తినా పోదు!