February 26, 2013

కాంగ్రెస్‌కు ఇదే చివరి రైల్వే బడ్జెట్

32 మంది ఎంపీలుండీ దండగ
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి రైల్వే బడ్జెట్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులు, 32 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండీ ఒరగబెట్టిందేం లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యే ఎదురవుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత బడ్జెట్‌లో చార్జీలు పెంచబోమని చెబుతూనే.. రిజర్వేషన్, తత్కాల్, టిక్కెట్ రద్దు చార్జీల రూపంలో ప్రయాణికులపై దొడ్డిదారిన భారం మోపారని విరుచుకుపడ్డారు.

రైల్వే శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికి చెందిన ఎంపీ ఉన్నా.. ప్రయోజనం చేకూర్చలేకపోయారని విమర్శించారు. ఇంకా.. ఆ పార్టీ నేతలు ముద్దుకృష్ణమనాయుడు, దాడి వీరభద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు, రాజేంద్ర ప్రసాద్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, రమేశ్ రాథోడ్, సుధారాణి, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప కూడా రైల్వే బడ్జెట్‌పై నిప్పులు చెరిగారు. కాగా.. హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని పార్టీ ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో కోరారు.