February 10, 2013

చంద్రబాబు పాదయాత్రకు భారీగా జనం

ప్రత్తిపాడు: జిల్లాలో చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రత్తిపాడు నుంచి బారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు.

మూడు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పాదయాత్రకు నాయకులు వెలుతున్నారు. శనివారం తెలుగుయువత జిల్లా నాయకుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ద్విచక్ర వాహనాలపై తెలుగుదేశం పార్టీ జండాలను కట్టుకుని సుమారు 200 వాహనాలతో ప్రత్తిపాడు నుంచి ప్రారంభమైన ర్యాలీలో గుంటూరు వరకు పార్టీ కార్యకర్తలు ర్యాలీలో కలుస్తూనే వచ్చారు. ప్రత్తిపాడు మండలంలోని నిమ్మగడ్డవారిపాలెం, మల్లాయపాలెం సొసైటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఆ పార్టీ నేతలలో ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో మల్లాయపాలెం నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చంద్రబాబు సభకు వెళ్లారు.

ఇలాగే బాగా పనిచేయండి

మీరు ఇదే స్ఫూర్తితో ఇలాగే పనిచేయండి మంచి భవిష్యత్ వుం టుంది అంటూ మల్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు కుర్రి సుబ్బారెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజం తట్టి ప్రోత్సహించారు.

ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వున్న మల్లాయపాలెం సొసైటీలో తెలుగుదేశం పార్టీ తరుపున అదే సామాజిక వర్గం పోటీచేసి ఘన విజయం సాధించిన విషయాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి కందుకూరి వీరయ్య, జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావులు చంద్రబాబు దృష్టికి తీసుకుళ్లారు.

ఆ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలతో పాటు కుర్రి సుబ్బారెడ్డిని చంద్రబాబుకు పరిచయం చేశారు. రెండు చోట్లా పార్టీని గెలిపించినందుకు స్థానిక నాయకులను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరామప్రసాద్, యడ్ల బాలాజీ, తెలుగుయువత నాయకుడు శెట్టి వెంకటశివ పాల్గొన్నారు.

వట్టిచెరుకూరు నుంచి

వట్టిచెరుకూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనటానికి వట్టిచెరుకూరు మండలం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు నాయుడు నాలుగు నెలలుగా చేస్తున్న పాదయాత్ర మూడు రోజుల క్రితం గుంటూరు చేరింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు శనివారం గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజక వర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వట్టిచెరుకూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు, జీపులు, కార్లతో ర్యాలీగా గుంటూరు వెళ్లారు.