February 10, 2013

ఎలా బతికేది..?


చంద్రబాబు పాదయాత్రకు అనూహ్యంగా మహిళల నుంచి స్పందన పెరిగింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వీధుల వెంట చంద్రబాబు రాక కోసం నిరీక్షిస్తున్నారు. హారతులు ఇస్తూ... నుదుటిన తిలకం దిద్దుతూ... పూలవర్షం కురిపిస్తూ స్వాగతిస్తున్నారు. కష్టాల కడలిలో జీవనసాగరం ఈదుతున్నామంటూ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఉప్పు నుంచి గ్యాస్ వరకు అన్ని ధరలు పెరిగిపోయాయని, తామెలా బతికేదంటూ కన్నీళ్లు పెట్టుకొంటుకుంటున్నారు. తాము కచ్ఛితంగా ఓటేస్తామని హామీ ఇస్తూ చంద్రబాబును సాగనంపుతున్నారు.

పెదకాకాని మండలం అగతవరప్పాడు నుంచి శనివారం చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం కాగా దారి పొడవునా మహిళలు బారులుదీరి తమ సమస్యలను నివేదించారు. గుంటూరుపట్టణ శివారు ఇన్నర్‌రింగురోడ్డు, ఎన్‌టీఆర్ కాలనీ, శివనాగరాజు కాలనీ, రాజీవ్‌గాంధీనగర్, సంజీవయ్యనగర్, వసంతరాయపురం, శారదాకాలనీలో చంద్రబాబు పాదయాత్ర కొనసాగిన వీధులన్నీ మహిళలతో నిండిపోయాయి. మహిళలు ప్రధానంగా బియ్యం, వంటనూనె, గ్యాస్ సిలిండర్, విద్యుత్ బిల్లులు మోయలేనంత భారంగా పరిణమించాయని నివేదిస్తున్నారు. బియ్యం కిలో రూపాయికి ఇచ్చి మిగతా వంట సరుకుల ధరలన్నీ అందుబాటులో లేకుండా చేశారని చెప్పారు. రోగం వచ్చి ఆస్పత్రికి వెళితే మందులు ఇవ్వకుండా పంపేస్తున్నారని వాపోయారు.

ఇలా చంద్రబాబుకు దారి పొడవునా మహిళలు తమ కష్టాలను చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకొంటున్నారు. చంద్రబాబు వారి బాధలు చూసి చలించిపోతున్నారు. తలపై చేయి వేసి ఓదారుస్తూ తానునున్నాని భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల ఒక్క రోజు తనకు ఇస్తే ఐదేళ్లు సేవకుడిగా మీ బాగోగులు చూసుకొంటానని ఇస్తున్న హామీకి మంచి స్పందన కనిపిస్తోంది. గ్యాస్, విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మద్యం బెల్టుషాపుల వలన తమ బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని మహిళలు నివేదిస్తుండగా బెల్టుషాపులు రద్దు చేసి ఆడబిడ్డల మంగళసూత్రాలు కాపాడతానని చెబుతున్నారు.

డ్వాక్రా గ్రూపుల మహిళలు కూడా చంద్రబాబు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తాము సక్రమంగానే పొదుపు పాటిస్తున్నా రివాల్వింగ్ ఫండ్ రావడం లేదని బాబు దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపైనా స్పందిస్తూ తాను అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల మహిళలు చెల్లించిన వడ్డీని తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేయిస్తానని బాబు ఇస్తోన్న హామీకి డ్వాక్రా మహిళలు నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రకు వస్తోన్న స్పందన చూస్తూ జనంలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇది ఎన్నికల నాటికి మరింత పెరిగి తమ పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు.