January 16, 2013

పాదయాత్రతో పార్టీని బలోపేతం చేస్తాం



కోదాడ నియోజకవర్గం నుంచి గురువారం ప్రారంభం కానున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర సందర్భంగా ఏర్పా ట్లు, ప్రజల సమీకరణ తదితర అంశాలపై ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి : పాదయాత్రను పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ఉపయోగించుకుంటారు ?

వేనేపల్లి : పాదయాత్ర ద్వారా నల్లగొండ జిల్లాతోపా టు, కోదాడ నియోజకవర్గంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తు న్నాము. వార్డుల వారీగా గ్రామాల నుంచి పాదయాత్రకు కార్యకర్తలను, అభిమానులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. నల్లగొండ జిల్లాలో, నియోజకవర్గంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉన్నదని, పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు ఈ పాదయాత్ర పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : ఏయే అంశాలు, సమస్యలను బాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ?

వేనేపల్లి : నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. సాగర్ ఆయకట్టులో నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యుత్‌పై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటుంటే కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులు పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్‌టీ.రామారావు వర్ధంతి రోజు రైతులతో బాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

ఆంధ్రజ్యోతి : పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు ?

వేనేపల్లి : పాదయాత్రను విజయవంతం చేసేందుకు నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి 12 నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులను తరలించేందుకు పార్టీ యంత్రాం గం చర్యలు చేపట్టింది. 5రోజుల పాదయాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన తేదీల ప్రకారం పార్టీ శ్రేణులను తరలిస్తాం.

ఆంధ్రజ్యోతి : పార్టీలో ఒక వర్గం పాదయాత్రకు దూరంగా ఉంది. ఏ మేరకు విజయవంతం చేస్తారు ?

వేనేపల్లి : పార్టీలో ఒక వర్గం దూరంగా ఉన్నదన్నది అవాస్తవం. పార్టీ అధినేత పాదయాత్రతో నల్లగొండ జిల్లాలకు వస్తున్నందున పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది. పాదయాత్రలో అందరూ పాల్గొంటారు.

ఆంధ్రజ్యోతి :స్వాగత ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ?

వేనేపల్లి : పాదయాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణలో చివరి జిల్లా కావడంతో ఖమ్మం నుంచి నల్లగొండ జిల్లాకు వస్తున్న సందర్భంగా శాంతినగర్ వద్ద పెద్ద ఎత్తున స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని పార్టీ నాయకులు బాబుకు స్వాగతం పలుకుతారు. సుమారు 4వందల మంది వివిధ కళాకారులచే కోలాట, భజనలతో స్వాగతం. పాదయా త్ర పొడవునా కళాకారులు బాబు యాత్రకు ముందు ఐదు రోజులు ఉంటారు. కోదాడలో కిట్స్ కళాశాల వద్ద బ్రాహ్మణోత్తములచే పూర్ణకుంభంతో స్వాగత ఏర్పాట్లు, మేకల అభినవ్ రోడ్డులో తన ఇంటి వద్ద 500 మంది మహిళలతో హారతి ఉంటుంది. పాదయాత్రలో బాబుకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం.

ఆంధ్రజ్యోతి : సభలు ఎక్కడెక్కడ నిర్వహిస్తారు ?

వేనేపల్లి : ప్రతి కూడలిలో చంద్రబాబు సభ ఉంటుంది. ప్రజలకోసం బాబు చేస్తున్న పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలతో మాట్లాడించడం తదితర కార్యక్రమాలు ఉంటాయి. 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురష్కరించుకుని ఖమ్మం క్రాస్‌రోడ్డులో విగ్రహావిష్కరణ అనంతరం 15వేల మందితో సభను ఏర్పాటు చేశాం. ఈ సంరద్భంగా అన్నదానం కార్యక్రమం ఉంటుంది.